స్టార్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా కవల మగ పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో సరోగసీ బ్యాన్ చేశారు.. మరి నయనతార నిబంధనలు పాటించకుండా ఎలా బిడ్డలను పొందారు అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. మరోసారి సరోగసీపై పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం సాగింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణ చేపడతామని వెల్లడించడమే కాక.. ఓ కమిటీని కూడా వేసింది. ఈ క్రమంలో నయనతార దుబాయ్ మహిళ ద్వారా సరోగసీ విధానంలో బిడ్డలను పొందినట్లు తెలియగా.. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే.. తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లైందని చెప్పి అందరికి బిగ్ షాక్ ఇచ్చారు నయనతార. ఆ వివరాలు..
ఇండియాలో కొత్తగా అమల్లోకి వచ్చిన సరోగసీ (రెగ్యులేషన్) చట్టం ప్రకారం.. ఈ విధానంలో బిడ్డలన్ని కనాలనుకుంటే.. ఆ దంపతులు ఐదేళ్ల వివాహ బంధాన్ని పూర్తిచేసుకుని ఉండాలి. పెళ్లై ఐదేళ్లు పూర్తయినా.. సంతానం లేని వారు మాత్రమే సరోగసీకి అర్హులువుతారు. అలానే ఈ విధానం ద్వారా బిడ్డలను కనాలనుకుంటే.. ఆ దంపతుల్లో భార్య వయసు కచ్చితంగా 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే భర్త వయసు 26 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా, ఆ దంపతులకు జన్యుపరంగా కానీ, దత్తత ద్వారా కానీ కనీసం ఒక్క బిడ్డ కూడా ఉండకూడదు. అలానే సరోగసీకి అంగీకరించే మహిళ.. ఈ దంపతులకు దగ్గర బంధువై ఉండాలి. ఆమెకు పెళ్లై ఉండటమే కాక అప్పటికే ఆమె కనీసం ఒక్క బిడ్డకు అయినా జన్మనిచ్చి ఉండాలి. సరోగేట్ మదర్ వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అంతేకాక ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలి.
అయితే నయనతార ఈ నిబంధనలేవీ దంపతులు అతిక్రమించలేదు. తమిళనాడు ప్రభుత్వం ఈ వివాదంపై నియమించిన విచారణ కమిటీకి నయనతార దంపతులు సమర్పించిన పత్రంలో తాము ఆరేళ్ల క్రితమే రిజస్టర్ వివాహం చేసుకున్నామని అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. వివాహానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌తో పాటు అఫిడవిట్‌ను కూడా అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక నయనతార దంపతులు 2021 డిసెంబర్‌లో సరోగసీ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. అలాగే, నయనతారకు పిల్లల్ని కని ఇచ్చింది యూఏఈలో ఉన్న ఆమె దగ్గరి బంధువని.. ఆమె చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో పిల్లలకు జన్మనిచ్చారని తెలిసింది. ఆ హాస్పిటల్ వివరాలు సైతం నయనతార ప్రభుత్వానికి వెల్లడించినట్లు తెలుస్తోంది.
తాము చట్టాన్ని అతిక్రమించలేదని.. అన్ని నియమాలను పాటించామని నయన్ దంపతులు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక విచారణలో నయనతార దంపతులు నిబంధనలకు వ్యతిరేకంగా సరోగసీ ద్వారా పిల్లలను పొందారని తేలితే.. పది సంవత్సరాల జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ నయనతార ఇచ్చిన సమాచారంతో సరోగసీ వివాదం ముగిసిపోతుందని భావిస్తున్నారు.