కొందరు పుట్టుక అసాధారణమైనది. కొందరు జీవితం అసామాన్యమైనది. తమకు, తమ తల్లిదండ్రులకే కాకుండా తాము పుట్టిన ఊరికి, జిల్లాకి సైతం గొప్ప పేరు తీసుకొస్తారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. మామూలు కుర్రాడిలా అందరిలానే ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నట శేఖరుడిగా ఎదిగారు. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా, సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు అనిర్వచనీయం. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోకూడదని తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇచ్చే సాంప్రదాయానికి పునాది వేసింది మన సూపర్ స్టార్ కృష్ణనే. అదే సాంప్రదాయాన్ని తన కొడుకు మహేష్ కి కూడా వారసత్వంగా ఇచ్చినటువంటి గట్స్ ఉన్న రియల్ హీరో కృష్ణ. సాహసమే తన ఊపిరిగా జీవించినటువంటి వెండితెర రారాజు.
హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఘనత సూపర్ స్టార్ ది. తెలుగు సినిమాకి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు కృష్ణ. టాలీవుడ్ లో మొదటి కౌ బాయ్, జేమ్స్ బాండ్ సినిమాలు తీసిన ఏకైక హీరో కృష్ణనే. తెలుగు నాట అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారో తెలియని వారికి.. కృష్ణలానే ఉంటారేమో అనేంత గొప్పగా ఆ పాత్రలో జీవించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి కృష్ణ గారు ఇవాళ మనలో లేకపోవడం మాత్రం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇవాళ ఆయన మరణించిన కారణంగా ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. వాటిలో కృష్ణ గారు రాసిన ఉత్తరం ఒకటి. ఆయన సినిమాల్లో అడుగుపెట్టేముందు మీడియాకి, ప్రేక్షకులకు ఒక పరిచయ లేఖ రాసుకొచ్చారు.
ఆయనే స్వయంగా రాసిన ఈ లేఖ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ లేఖలో ఇలా రాసి ఉంది. “రసిక ప్రపంచానికి నా వందనాలు. నా పేరు కృష్ణ. ‘తేనెమనసులు’ చిత్రంలో పేరు బసవరాజు. సినిమాలో నటించాలన్న ఆశతో ఎన్నాళ్ళ నుంచో లెఫ్ట్ రైట్ కొడుతూ కలగంటున్న నాకు ఇన్నాళ్ళకి అది రంగురంగుల కలగా ఈస్ట్ మన్ కలర్ లో నిజమైంది. కానీ దాని కోసం దర్శకులు, డాన్సు డైరెక్టరు నా చేత మూడు మాసాల పాటు అక్షరాలా డ్రిల్లు చేయించారు. తరవాత నటన నేర్పారు. డాన్సు నేర్పారు. చివరకి నా వేషం ఏవిటండీ అంటే డ్రిల్లు మేష్టరేనన్నారు. నటన మాత్రం డ్రిల్లులాగే రాకుండా జాగ్రత్తగా శ్రద్ధగా పని చేశాననుకోండి. మీరందరూ చూసి బాగోగులు చెప్పే క్షణం కోసం ఆశతో, ఆరాటంతో ఎదురుచూస్తున్నాను. ఉగాదికి నా శుభాకాంక్షలు. కృష్ణ. 27.03.65” ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు స్వయంగా ప్రేక్షకులకు తనను తాను పరిచయం చేసుకుంటూ రాసిన ఉత్తరం.
కృష్ణలో అగ్నిపర్వతం లాంటి నటనే కాదు, నవ్వించే కూసింత హాస్యం కూడా ఉంది. తేనెమనసులు సినిమాలో కృష్ణ గారి పాత్ర డ్రిల్ మాస్టర్. డ్రిల్ మాస్టర్ పని లెఫ్ట్, రైట్.. లెఫ్ట్ రైట్ అని చేతులూ ఊపుతూ ముందుకు కదలడం. ఆ డ్రిల్ మాస్టర్ పనిని తన జీవితానికి ముడిపెడుతూ జీవితం లెఫ్ట్ రైట్ కొడుతూ కలగంటున్న అని అన్నారు. అంతేనా.. అప్పటివరకూ కలలు బ్లాక్ అండ్ వైట్ లో ఉంటే.. తేనెమనసులు చిత్రంతో రంగురంగుల కలగా తన కల నిజమైంది అని అన్నారు. అలా కాస్త చమత్కారం జోడించి.. తనను తాను ఈ రసిక లోకానికి పరిచయం చేసుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనెమనసులు సినిమా 1965 మార్చి 31న విడుదలైంది. రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఆయన తనను తాను ఇలా సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. ఇలా కొత్తగా ఆలోచిస్తూ ట్రెండ్ సెట్ చేయడం అనేది కృష్ణకి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం ఈ ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
— Hardin (@hardintessa143) November 15, 2022