బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ తర్వాత జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తెలుగు లో కరెంట్ తీగ, గరుడ వేగ తర్వాత ఇటీవల విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో నటించింది. తాజాగా ఓ చీటింగ్ కేసులో సన్నీలియోన్ ఆమె భర్త, మేనేజర్ కి కేరళా హై కోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే..
సన్నీలియోన్ ఓ వైపు వెండితెరపై నటిస్తూనే పలు ఈవెంట్స్ లో తన హాట్ డ్యాన్స్ తో ఉర్రూతలూగిస్తుంది. ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాల క్రితం కోజీకోడ్ లో స్టేజ్ షో కోసం ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో 36 లక్షలు తీసుకున్నప్పటికీ ప్రదర్శనకు హాజరు కాకుండా చీటింగ్ చేశారంటూ నిర్వాహకుడు శియాస్ కుంజు మహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 లో సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ తో పాటు మేనేజర్ సునీల్ రజినీపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ చీటింగ్ కేసు ఎర్నాకులం కోర్టులో విచారణ జరుగుతుంది.
ఈ కేసు విషయంపై సన్నీలియోన్ వాదన వేరేలా ఉంది.. ఈవెంట్ విషయంలో తమ తప్పు ఏమీ లేదని.. ఆర్గనైజర్ అన్నీ అబద్దాలు ఆడుతున్నాడని తెలిపింది. అంతేకాదు తమకు రావాల్సిన డబ్బు సకాలంలో ఇవ్వకుండా.. తమను దీర్ఘకాలం విచారణ ఎదుర్కొనేలా చేసి భారీగా నష్టపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో ఎర్నాకులంలో కోర్టులో జరుగుతున్న చీటింగ్ కేసు విచారణ నిలిపి వేయాలని దాఖలు చేసిన పిటీషన్ ను జస్టిస్ట్ జియాద్ రెహ్మాన్ స్వీకరించారు. ఈ కేసు పిటీషన్ పరిశీలించిన పిదప న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు వరకు స్టే విధించారు. దీంతో సన్నీలియోన్ కి కేరళా హై కోర్టు లో కాస్త ఊరట లభించింది.