అడుసు తొక్కనేల..కాలు కడగనేల అనేది పాతకాలం నుంచి ఉన్న నానుడి. నోరు జారడమెందుకు ఆ తరువాత క్షమాపణలు చెప్పడమెందుకు. ఎంత క్షమాపణలు చెప్పినా పెదాలు దాటిన మాటల ప్రభావం పోతుందా..ఇప్పుడీ ముద్దుగుమ్మకు చేసిన తప్పు ఆలస్యంగా తెలిసొచ్చినట్టుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ అవకాశాలు చేజిక్కించుకుంటున్న బెంగాలీ భామ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీతారామం బ్యూటీగా అందర్నీ ఆకట్టుకున్న ఈమె నాని సినిమా హాయ్ నాన్నతో ఆకర్షించింది. అందం అభినయమే కాదు ఈ ముద్దు గుమ్మకు కాస్త నోటి దురుసు కూడా ఎక్కువే. అయితే ఈ విషయం ఈమెకు కాస్త ఆలస్యంగా తెలిసొచ్చినట్టుంది. అడుసు తొక్కకముందే జాగ్రత్తగా ఉండే ఆ తరువాత కాలు కడగాల్సిన అవసరం ఉండదు కదా. నోరు జారక ముందే అదుపులో ఉంటే క్షమాపణల అవసరం ఉండేది కాదు. అసలేం జరిగిందంటే..
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మృణాల్ ఠాకూర్ ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను బిపాసా కంటే అందంగా ఉంటానని..బిపాసా మాత్రం కండలు తిరిగి మగవారిలా ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట తీవ్ర దుమారం రేగింది. బిపాసా కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మృణాలు పేరు ఎత్తకుండానే పరోక్షంగా దీటైన సమాధానమిచ్చింది. అటు బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం మృణాలు వ్యాఖ్యలపై మండిపడ్డారు. దాంతో చేసిన తప్పు ఈ అందాల భామకు తెలిసొచ్చింది.
చాలా తప్పుగా మాట్లాడాను..క్షమించండి
ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతోంది. తాను 19 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలని అంటోంది. ఆ వయసులో తనకు ఏం తెలియలేదని, తప్పుగా మాట్లాడానని అంటోంది. అప్పుడు తనకు అందం అంటే ఏంటో తెలియలేదని, ఇప్పుడు తెలుస్తోందని చెబుతోంది. మనసుతో చూసే దాంట్లోనే అందం ఉంటుందని..ఈ విషయం తెలియక తప్పుడు వ్యాఖ్యలు చేశానంటోంది. ఇంత పెద్ద ఇష్యూ అవుతోందనుకోలేదంటూ క్షమాపణలు చెప్పింది.