ప్రముఖ నటుడు, సీనియర్ జర్నలిస్ట్ డీఎంకే మురళి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మురళి మృతిపై పలువురు సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, డీఎంకే మురళి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. నటన మీద ఆసక్తితో రంగస్థలంలోకి అడుగుపెట్టారు. పలు పౌరాణిక, సాంఘీక నాటకాల్లో నటించారు. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి కాలంలో సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చేశారు.
అవకాశాల వేటలో ఎన్నో అనుభవాలను పోగుచేసుకున్నారు. కష్టనష్టాలను భరించారు. ఈ నేపథ్యంలోనే దర్శకత్వ శాఖలో కూడా పని చేశారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌గా కూడా పని చేశారు. ఓ వైపు జర్నలిస్ట్‌గా పని చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం తిరిగారు. ‘అందాల రాక్షసి’ సినిమాలో ఆయనకు అవకాశం వచ్చింది. మారుతి దర్శకత్వం వహించిన ‘బస్‌స్టాప్’ సినిమాలోనూ కీలక పాత్ర చేశారు. ‘తడాఖా’, కొత్తజంట, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాలు చేశారు. నాగ చైతన్య, సునీల్ హీరోలుగా నటించిన ‘తడాఖా’లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలో సునీల్ ఎస్‌ఐగా పనిచేసే స్టేషన్‌కు మురళి సీఐగా ఉంటారు.