Senior Actor Mannava Balayya Passed Away: ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూశారు. వయోభారం కారణంగా గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 92వ ఏట శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ రోజు బాలయ్య పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడే ఆయన మరణించటం గమనార్హం. బాలయ్య మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బాలయ్య మృతిపై సంతాపం తెలియజేశారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
లెక్షరర్ నుంచి హీరోగా…
బాలయ్య 1930 ఏప్రిల్ 9వ తేదీన గుంటూరు జిల్లా అమరావతిలోని చావుపాడులో మన్నవ గురవయ్య చౌదరి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. చెన్నై గిండి ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ చదివారు. మద్రాసులోనే ఓ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్షరర్‌గా చేరారు. లెక్షరర్‌గా విధులు నిర్వహిస్తూనే నాటకాలు వేసేవారు. ఆయనను చాలా మంది హిందీ నటుడు అశోక్ కుమార్‌లాగా ఉన్నావని అనేవారు. దీంతో ఆయనకు సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది. స్నేహితుల సహకారంతో పరిశ్రమలోకి వచ్చారు. ‘రోజులు మారాయి’ దర్శకుడు తాపి చాణక్యను కలిశారు. ఆయన బాలయ్యను హీరోగా పెట్టి ‘‘ ఎత్తుకు పై ఎత్తు’’ సినిమా చేశారు. సారథి స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా అంతగా ఆడలేదు. అయినప్పటికి చాణక్య దర్శకుడిగా.. సారథి స్టూడియోస్ నిర్మాణంలో ‘‘భాగ్యదేవత, కుంకుమ రేఖ’’ సినిమాల్లో హీరోగా చేశారు. మరికొన్ని సినిమాల్లోనూ హీరోగా చేశారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగారు. దాదాపు 300 సినిమాల్లో నటించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి బాలయ్య..
హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టిన బాలయ్య నటుడిగానే కాదు ప్రొడ్యూసర్‌గా, దర్శకుడిగా, రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. 1983లో వచ్చిన ‘‘నిజం చెబితే’’ నేరమా అన్న సినిమాతో దర్శకుడిగా మారారు. ‘‘పసుపు తాడు, పోలీస్ అల్లుడు’’ సినిమాలకు దర్శకత్వం వహించారు. రచయితగా ‘‘ చెల్లెలి కాపురం’’ ఆయన మొదటి సినిమా. ‘‘ఊరికిచ్చిన మాట’’ సినిమాకు గానూ ఉత్తమ రచయితగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక నిర్మాణ రంగంలోనూ తన దైన ముద్ర వేసుకున్నారు. తాను రచించిన సినిమా ‘‘చెల్లెలి కాపురం’’ సినిమాతో నిర్మాతగా మారారు. అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా దాదాపు 10 సినిమాలను నిర్మించారు. ‘‘చెల్లెలి కాపురం’’ చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.
ఇవి కూడా చదవండి : తన బ్రేకప్ లవ్ స్టోరీపై బిందు మాధవి ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.