‘శాకుంతలం’ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు సమంత. ‘యశోద’తో గతేడాది మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న సామ్.. ఈ మూవీతో ఇంకెలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత ఏమన్నారంటే..!
టాలీవుడ్ ప్రేక్షకుల్లో సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. హీరోల స్థాయిలో ఆమెను ఆదరించే అభిమాన గణం ఉంది. అందంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆడియెన్స్ హృదయాల్లో ఆమె చెరగని స్థానం సంపాదించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్.. సినిమాలను తగ్గిస్తూ వస్తున్నారు. ఆమె నటించిన గత చిత్రం ‘యశోద’ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. ‘మయోసైటిస్’తో బాధపడుతున్న సమంత.. దానికి చికిత్స తీసుకుంటూనే ‘శాకుంతలం’ మూవీని పూర్తి చేశారు. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది.
‘శాకుంతలం’ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ.. ‘శాకుంతలం’ స్టోరీ విన్నప్పుడు తాను సర్ప్రైజ్ అయ్యానన్నారు. మన దేశ సాహిత్యంలో ఎంతోమంది ప్రేమించే శకుంతల క్యారెక్టర్‌ను పోషించడం తనకు పెద్ద బాధ్యతగా అనిపించిందన్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో రాజీ లాంటి పాత్ర చేసిన తర్వాత శకుంతల క్యారెక్టర్ చేయడానికి తొలుత భయపడ్డానని సామ్ చెప్పుకొచ్చారు. కానీ హుందాతనం, ఆత్మగౌరవం కలిగిన శకుంతల పాత్ర ఏ తరం వారికైనా కనెక్ట్ అవుతుందని మళ్లీ ఆలోచించి ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ‘శాకుంతలం’ ట్రైలర్‌ను 3డీలో చూసి షాక్ అయ్యానన్నారు సామ్.
‘శాకుంతలం’ చిత్ర విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా సమంత ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఒకప్పుడు నా జీవితంలో ఏ సమస్యలూ లేవు. నేను చాలా సింపుల్‌గా, ఆనందంగా ఉన్నా. కానీ నా లైఫ్‌లో నేను కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ జీవితాల్లో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు వారు మునుపటి కంటే దృఢంగా మారిపోతుంటారు. నేను కూడా అంతే. నన్ను నేను స్పెషల్ అని అనుకోవడం లేదు. అయితే నా లైఫ్‌లో నాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నా. అందుకు తగ్గట్లుగా లైఫ్‌లో ముందుకెళ్తున్నా’ అని సమంత వ్యాఖ్యానించారు.