నటీనటులు: సూర్య, ప్రియాంక మోహన్, సత్యరాజ్, వినయ్ రాయ్, శరణ్య, రాజ్ కిరణ్ తదితరులు
బ్యానర్: సన్ పిక్చర్స్
నిర్మాత: కళానిధి మారన్
సంగీతం: డి. ఇమాన్
సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
ఎడిటర్: రూబెన్
రచన – దర్శకత్వం: పాండిరాజ్
స్టార్ హీరో సూర్య నుండి సినిమా వస్తుందంటే తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు. తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య సినిమా అంటే తమ సినిమా అన్నట్టుగానే ఓన్ చేసుకొని చూస్తుంటారు. సూర్య నుండి గత మూడేళ్లలో ఒక్క సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ కాలేదు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా కరోనా కారణంగా ఓటిటి రిలీజ్ అయ్యాయి. అయినా కూడా మంచి విజయం సాధించి ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక సూర్య నుండి మాస్ సినిమా ఎక్సపెక్ట్ చేస్తున్న తరుణంలో ఈటి సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈటీ సినిమాతో సూర్య హ్యాట్రిక్ కొట్టాడా లేదా.. సినిమా విశేషాలెంటో చూద్దాం!
ఈటీ.. మహిళల సమస్యలే ప్రధాన కథాంశంగా తెరకెక్కిన చిత్రమిది. రెండు గ్రామాల మధ్య జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ కారణంగా.. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న ఓ పెద్ద సమస్య వెలుగులోకి వస్తుంది. ఆ సమస్య నిజాయితీ పరుడైన లాయర్ కృష్ణమోహన్(సూర్య) చెవినపడి దానిపై పోరాడుతుంటాడు. ఈ క్రమంలో ఆ సమస్య కృష్ణమోహన్ ఇంట్లోవారికే ఏర్పడుతుంది. స్త్రీలను తక్కువచేసి చూసే ఓ ముఠా ఈ పని చేస్తుందని.. ఆ ముఠాకు సూత్రధారి కేంద్రమంత్రి కొడుకు కామేష్(వినయ్ రాయ్) చేస్తున్నాడని తెలుసుకొని తనలోని మాస్ యాంగిల్ బయటికి తీస్తాడు. మరి ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏంటి? లాయర్ కృష్ణమోహన్ విలన్ కామేష్ ని ఎలా అంతం చేశాడు? చివరిగా మహిళల సమస్యకు పరిష్కారం ఇచ్చాడా లేదా? మహిళలకు ఎలాంటి సందేశం ఇచ్చాడు? అనేది మిగిలిన కథ.
స్టార్ హీరో సూర్యకి క్లాస్ మాస్ ఫ్యాన్ బేస్ ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూర్య చేసే ప్రతి సినిమా తెలుగులో డబ్ అయినా రిలీజ్ మాత్రం భారీ స్థాయిలోనే అవుతుంది. మాములుగానే సూర్య తన ప్రతి సినిమాలో ఏదొక సామాజిక సమస్యను కథాంశంగా ఎంచుకుంటాడు. ఇప్పుడు ఈటితో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ ఈసారి ప్రస్తుతం మహిళలు, చదువుకునే ఆడపిల్లలు ఎదుర్కొంటున్న మేజర్ సమస్యను కథాంశంగా ఎంచుకున్నాడు. సోషల్ మీడియా యాప్స్.. వాట్సాప్, ఇంస్టాగ్రామ్ తదితర యాప్స్ ద్వారా ప్రస్తుతం ఆడపిల్లలు ఎలా బ్లాక్ మెయిల్ కి గురవుతున్నారు? మొబైల్, లవ్ పిచ్చిలో ఎలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు? అనేది క్లుప్తంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకనిర్మాతలు.
లాయర్ కృష్ణమోహన్ గా సూర్య తనకు స్త్రీలపై ఉన్న గౌరవాన్ని బయటపెట్టేశాడు. వరుస విజయాలతో ఉన్న కమర్షియల్ స్టార్ అయినప్పటికీ.. సూర్య ఇలాంటి కథను ఎంచుకోవడం అభినందించాల్సిన విషయం. “మగాడికి సమస్య వస్తే అరగంట ఆలస్యం అవుతుందేమో.. కానీ అదే ఏ ఆడపిల్లకైనా సమస్య వస్తే అరక్షణంలో అక్కడుంటా.. ఐ విల్ షో థెమ్ ది హెల్” అనే బాలయ్య డైలాగ్.. ఈ సినిమాలో సూర్య పాత్రకు పక్కాగా సూట్ అవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎమోషనల్ సీన్స్, మాస్ ఫైట్స్ లో సూర్య చెలరేగిపోయాడు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని క్లాస్, మాస్ సీన్స్ తో సూర్య ఆకట్టుకున్నాడు. కృష్ణమోహన్ భార్య అధిరా పాత్రలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కనిపించింది. ఈ సినిమాలో ప్రియాంకకు పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. లుక్ పరంగా కూడా ప్రియాంక చక్కగా ఉంది. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో ప్రియాంకకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.
లాయర్ కృష్ణమోహన్ తండ్రిగా సత్యరాజ్, తల్లిగా శరణ్య పొన్నవన్ మెప్పించారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలలో ప్రేక్షకులను నవ్వించారు. అలాగే కామెడీ సీన్స్ లో హీరోయిన్ పేరెంట్స్ గా రాజ్ కిరణ్, దేవాయని పాత్రలు హైలైట్ అవుతాయి. సినిమాకి దర్శకుడు పాండిరాజ్.. ఇదివరకు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేశాడు. కానీ ఈసారి విలేజ్ నేపథ్యంలోనే ఓ మేజర్ సమస్యను జనాల ముందుంచాడు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ కాస్, ఆడపిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాలను క్లియర్ గా డిస్కస్ చేశాడు. ఈటి సినిమా ఓపెనింగ్ ఓ మాసీవ్ హీరో ఎంట్రీతో స్టార్ట్ చేసి.. ఫస్ట్ హాఫ్ ఫుల్ స్పీడ్ గా తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఇక సెకండ్ హాఫ్ డీసెంట్ గా సాగినప్పటికి మధ్యమధ్యలో ఎమోషనల్ సీన్స్ కారణంగా సినిమా నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది.
కానీ సినిమా ఎండింగ్ వచ్చేసరికి మగవారు ఇంటి ఆడవారి విషయంలో ఎంత అశ్రద్ధగా ఉన్నామో.. బయటి ఆడవారి విషయంలో ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నామో చాలా క్లియర్ గా చెప్పాడు. ఈ సందేశం అందించేందుకు సినిమాలో ఎక్సాంపుల్ సీన్స్ చాలానే ఉన్నాయి. సూర్య లాంటి పెద్దహీరోని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. కథనం స్లో అయినప్పటికీ ఎంచుకున్న సబ్జెక్టుతో శభాష్ అనిపించాడు దర్శకుడు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ సంగీతం. నేషనల్ అవార్డు విన్నర్ డి. ఇమాన్ పాటలు బాగున్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. ముఖ్యంగా సాంగ్స్, మాస్, ఎమోషనల్ సీన్స్ కి పూర్తి న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ ఆర్. రత్నవేలు.. కెమెరా వర్క్ మాసీవ్ గా ఉంది. ఫైట్స్, సాంగ్స్, హీరో హీరోయిన్స్ లుక్స్ అందంగా చూపించాడు. ఎడిటర్ రూబెన్.. ఈటి సినిమాకి ప్లస్ అయినప్పటికీ.. లాంగ్ ఎమోషనల్ సీన్స్ ఉండటం వలన కొన్నిచోట్ల కత్తెర వేస్తే బాగుండేది. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ డిజైన్ చేసిన ఎంట్రీ ఫైట్, ఇంటర్వెల్ సీక్వెన్లులు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. నిర్మాత కళానిధి మారన్.. సన్ పిక్చర్స్ అంటే సినిమాలు భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఉంటాయనే విషయం తెలిసిందే. ఈటి పాన్ ఇండియా మూవీ కాదు.. కానీ నిర్మాణ విలువలు ఆ స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి సూర్య మంచి సబ్జెక్టుతో థియేటర్స్ లో మాసీవ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈటీ.. ఎవరికీ తలవంచకు.. మూవీ ఖచ్చితంగా ఫ్యామిలీతో చదువుకుంటున్న ఆడపిల్లలు, ఇంట్లో ఉండే ఆడవాళ్లు, ఉద్యోగాలు చేసే మహిళలు చూడాల్సిన మూవీ ఇది.
స్టోరీ పాయింట్
మెయిన్ క్యారెక్టర్స్ యాక్టింగ్
సంగీతం, కామెడీ
స్ట్రాంగ్ ఎమోషన్స్
ఫైట్స్
సెకండ్ హాఫ్ లో నెమ్మదించిన స్క్రీన్ ప్లే
లాంగ్ ఎమోషనల్ సీన్స్
వీక్ విలన్ క్యారెక్టర్
ఈటీ.. మంచి సబ్జెక్టు ఉన్న సినిమా!