రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి అనేక నటీనటులు వచ్చారు. పలువురు పార్టీని ఏర్పాటు చేసిముఖ్యమంత్రులు అయ్యారు. మరికొంత మంది మంత్రులు అయ్యారు. అదేవిధంగా నటనా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న వారూ ఉన్నారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని భావించే నటులున్నారు. అటువంటి వారిలో రజనీకాంత్ ఒకరు. అయితే ఆయన అనూహ్యంగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. దానికి కారణాలను ఆయన వెల్లడించారు.
నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదూ. సినిమా రంగంలో నుండి అనూహ్యంగా రాజకీయ జీవితంలోకి వచ్చి పార్టీలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి హోదాలను అధిరోహించినవారున్నారు. అలాగే పలు మంత్రి పదవులను చేపట్టిన వారున్నారు. కొంత మంది ప్రయోగాలు చేసి విఫలమౌనవారున్నారు. ఇక తెలుగు, తమిళ పరిశ్రమలకు ఇవేమీ కొత్తకాదూ. అనేక మంది సినీ కళాకారులు రాజకీయాల్లో చక్రం తిప్పారు. తిప్పుతున్నారు. తెలుగు కన్నా ముందు ఈ ట్రెండ్‌ను తీసుకువచ్చింది తమిళ పరిశ్రమే. అన్నాదురై నుండి నేడు మంత్రిగా వ్యవహరిస్తున్న ఉదయ్ నిథి స్టాలిన్ వరకు అందరూ సినీ పరిశ్రమకు చెందిన వారే. అటువంటి వారిలో ఒకరు రజనీకాంత్. పరోక్షంగా రాజకీయాలతో ముడిపడి ఉన్న ప్రత్యక్ష రాజకీయాల వైపుగా రాలేదు.
ఎప్పటి నుండో రజనీ స్నేహితుడు, మరో స్టార్ నటుడు కమల్ హాసన్‌లా పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతూనే ఉన్నా.. ఆయన ఏ మాత్రం స్పందించడం లేదు. తాజాగా, ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి రజినీకాంత్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ సన్యాసం చేపట్టడంపై మాట్లాడుతూ.. తనకు కిడ్నీ సమస్య ఉందని, అందు వల్లే రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరాదని అప్పట్లో తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రాజన్ రవిచంద్రన్ సలహా ఇచ్చారని చెప్పారు.
తాను రాజకీయాల్లోకి రావాలనుకన్న సమయంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ ముంచుకొచ్చిందని, దీనిపై తన డాక్టర్‌ను అభిప్రాయం కోరగా.. రాజకీయాల్లోకి తాను వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు కానీ, ప్రచారాలకు వెళ్లకూడదని, ప్రజలను కలవకూడదని సూచించారు. ఒకవేళ తప్పుదూ రాజకీయాల్లోకి తాను వెళ్లాలనుకుంటే కనీసం పది అడుగుల దూరంలో నిలబడి, నిరంతరం మాస్క్ ధరించాలని సూచించారన్నారు. బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, ఓసారి వాహనంలో వెళుతుంటే మాస్క్ తీయాలని ప్రజలు కోరారని, ఆ సమయంలో ప్రేక్షకులను అదుపు చేయలేమని అన్నారు. అందువల్లే రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఈ విషయాలన్నీ చెబితే తాను భయపడిపోతున్నా అనుకుంటారని, అందుకే ఎక్కడా బయటపెట్టలేదని వివరించారు
తన ఆరోగ్యం, రాజకీయం ప్రవేశంపై తన డాక్టర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాననన్నారని తెలిపారు. మనమేమీ అబద్ధాలు చెప్పడం లేదని భావించి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించానని తెలిపారు. శరీరంలోని వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుందని, రక్తాన్ని మానవులెవరూ తయారు చేయలేరని, దేవుడున్నాడు అనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. దేవుడు లేడు అనేవారు కనీసం ఒక బొట్టు రక్తాన్నైనా తయారుచేసి చూపించాలని సవాల్ విసిరారు. ఇక, మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావొద్దని తాను చెప్పినట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో తనను ఆయన అపార్థం చేసుకున్నారని వివరించారు. యువత ఫాస్ట్ ఫుడ్ ఆహారానికి అలవాటు పడ్డారని, అయితే వాటికి స్వస్థి చెప్పి మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. రజనీ కాంత్ చెప్పిన మాటలను బట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా లేదా అన్న విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.