ప్రముఖ కన్నడ హీరోయిన్ రాగిణి ద్విదేది గాయపడ్డారు. ‘‘నన్నొబ్బ బరతియా’’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆమె ఎడమ చేతికి గాయం అయింది. ఆసుపత్రిలో చికత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఓ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం మళ్లీ యథావిథిగా సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక, తన చేతికి గాయం అయిన విషయాన్ని రాగిణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. చేతి గాయానికి సంబంధించిన తన ఫొటో ఒకటి షేర్ చేశారు. ‘‘ మీ శరీరం దేన్నైనా తట్టుకోగలుగుతుంది.
ఇక, మీ బుర్రను మీరే కన్విన్స్ చేయగలగాలి. నవ్వు ఎప్పుడూ చెరగకుండా ఉంటుంది. త్వరలో రంగంలోకి దిగుతా..’’ అని పేర్కొన్నారు. ఇక, ‘‘నన్నొబ్బ బరతియా’’ సినిమా యాక్షన్ ప్యాకెడ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రాగిణి కమాండో పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఎంతో శ్రమకు ఓడుస్తున్నారు. ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె దీనిపై మాట్లాడుతూ.. ‘‘ కమాండో పాత్రను పోషించటం అన్నది చాలా క్లిష్టమైనది. ఇందు కోసం కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకుంటున్నాను.
మహిళా కమాండోల శక్తేంటో తెలియజెప్పటానికి కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం తుపాకులతో కూడా కుస్తీ పడుతున్నా’’ అని తెలిపారు. కాగా, రాగిణి ద్విదేది 2009లో వచ్చిన ‘వీర మడక్కరి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో శాండల్‌వుడ్ టాప్ హీరోల్లో ఒకరైన కిచ్చ సుదీప్ సరసన హీరోయిన్‌గా నటించారు. కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ నటించారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేశారు. 2015లో వచ్చిన ‘‘జెండాపై కపిరాజు’’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. హీరో నాని సరసన ఓ కీలక పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం కన్నడ సినిమాకే పరిమితం అయ్యారు.