డాబు దర్పం లేకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ కోట్లు సంపాదించి ప్రజలకు పంచుతన్న గొప్ప మహనీయుడు ఆర్ నారాయణ మూర్తి. ప్రజా జీవితం కోసం అవివాహితుడిగా ఉన్న గొప్ప వ్యక్తి.
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా రంగంలో తనది ప్రత్యేకమైన ప్రయాణం. తన సినిమాల్లో పేదల, రైతుల, కార్మికుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించేవారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అణచివేతలను గమనించి తన సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. ఎర్రసైన్యం, చీమల దండు వంటి విప్లవ చిత్రాలతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. సినీ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా రాణించి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. తను చేసిన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచి వారి గుండెల్లో దేవుడయ్యాడు. అనేక సామాజికి కార్యక్రమాలు చేపట్టారు.
కొందరు సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఒక్క సినిమా విజయంతోనే ఖరీదైన కార్లు, ఖరీదైన ఇళ్లు కొనుక్కుని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే.. ఆర్ నారాయణ ముర్తి గారు మాత్రం ఎన్ని విజయాలు సాధించిన ఇప్పటి వరకు సొంత ఇళ్లు, కారు లేదు. సాధారణమైన బట్టలు ధరించి, ఆటోల్లోనే ప్రయాణిస్తారు. నిరాడంభరమైన జీవితాన్ని గడుపుతారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే లక్షణం ఆయన సొంతం. ప్రజా జీవితానికి ఎక్కడ దూరమవుతానోనని భావించి వివాహానికి దూరంగా ఉన్న గొప్ప వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో చిన్నయ్య నాయుడు, రెడ్డి చిట్టెమ్మలకు మూడో సంతానంగా పీపుల్స్ స్టార్ రెడ్డి నారాయణ జన్మించారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. సినిమాలపై ఉన్న మక్కువతో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నే మద్రాసు బాట పట్టారు. సినిమాల్లో నటిస్తూనే బిఏ పూర్తి చేశారు.
సొంతంగా స్నేహ చిత్ర బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించారు. అయితే గతంలో సుమన్ టీవీ ఆర్ నారాయణ మూర్తి హోమ్ టూర్ నిర్వహించగా ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ ల స్ఫూర్తితో సినిమాలకు ఆకర్షితం అయ్యాడని తెలిపింది. సినిమాలే లోకంగా ప్రజలే ప్రాణంగా తన జీవితాన్ని మలుచుకున్నాడని తల్లి తెలిపింది. తనకు పంచిఇచ్చిన 12 ఎకరాల భూమిని కూడా పంచిపెట్టాడని తెలిపింది. డబ్బులు కూడ బెట్టుకోమని, సొంత ఇళ్లు కట్టుకోవాలని, పెళ్లి చేసుకోవాలని తన కొడుక్కి ఎన్నో సార్లు చెప్పానని, అయిన ఆయన వినకుండా ప్రజా జీవితమే ముఖ్యమని తెలిపినట్లు రెడ్డి చిట్టెమ్మ తెలిపింది. మహోన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి తన కడుపున పుట్టినందుకు ఆమె గర్వంతో ఉప్పొంగిపోయింది.