‘గాడ్ ఫాదర్’.. రీమేక్స్ స్పెషలిస్ట్ దర్శకుడు మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి.. అదే జోరును థియేటర్లలో ప్రదర్శిస్తోంది. దాంతో సినిమా యూనిట్ వరుసగా సక్సెస్ ఇంటర్వ్యూలను ఇస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సత్యదేవ్, మోహన్ రాజ, నిర్మాత ఎన్వీ ప్రసాద్ లు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాత, తమన్ లు. “గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను తమనే సూచించాడని” తెలిపారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. అయితే టైటిల్ వల్ల హాలీవుడ్ వాళ్లు మా మీద కేసు పెట్టారు అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు.
చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఓ నట శిఖరం. ఆయన నుంచి సినిమా వస్తోంది అంటే చాలు.. ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తారు. అయితే రాజకీయాల నుంచి దూరంగా జరిగిన తర్వాత సినిమాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే మలయాళం మూవీ అయిన ‘లూసీఫర్’ ను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న యూనిట్ పలు ఆసక్తిక విషయాలను అభిమానులతో పంచుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతు..”నేను చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు.. అన్నయ్య మీకు ఘరాన మెుగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి హిట్ సినిమాలన్నీ ‘జీ’ తోనే స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను. అప్పుడు చిరంజీవి గారు వీడెంటీ ఇలా అంటున్నాడు అన్నట్లు చూశాడని తమన్ తెలిపాడు. గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను సజెస్ చేసి నేను వెళ్లిపోయాను” అని తమన్ అన్నాడు.
అనంతరం మాట్లాడిన నిర్మాత ఎన్వీ ప్రసాద్.. నవ్వుతూ తన బాధను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..”తమన్ గాడ్ ఫాదర్ అని ఆయన పాటికి ఆయన చెప్పి వెళ్లిపోయాడు తర్వాత మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఆయన చెప్పినట్లుగానే గాడ్ ఫాదర్ అని టైటిల్ ఫిక్స్ చేశాం. అప్పటికే ఆ టైటిల్ ను డైరెక్టర్ సంపత్ నంది దగ్గర ఉంటే అడగ్గానే.. ఆయన మాకు ఇచ్చారు. మేం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాం. అప్పుడే మాకు పారమోంట్ అనే హాలీవుడ్ సంస్థ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మీరు గాడ్ ఫాదర్ టైటిల్ ఫారెన్ లో వాడొద్దు అని. ఎందుకంటే వారు 1990 లోనే ఇండియాలో ట్రేడ్ మార్క్ లో టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. దాంతో మేం అయోమయంలో పడిపోయి.. తెలుగులో గాడ్ ఫాదర్ అని, హిందీలో మెగాస్టార్ గాడ్ ఫాదర్ అని, ఇంగ్లీష్ లో 153 చిరు గాడ్ ఫాదర్ అని మార్చి.. వారితో ఓ నెగోషియేషన్ ఏర్పాటు చేసుకున్నాం.
ఈ క్రమంలోనే మధ్యలో మాట కలిపిన తమన్..”నాకు చాలా ఆనందంగా మీకు ఇంత శ్రమ కల్పించినందుకు” అంటూ నవ్వుతూ.. చెప్పాడు. మళ్లీ ఎన్వీ ప్రసాద్ అందుకుని.. మాకు ఢిల్లీ నుంచి సెప్టెంబర్ 22 న నోటీసులు అందాయి. మీరందరు సంతకాలు చేసి ఆ పత్రాలను మాకు సమర్పించాలని దాంతో మేం అందరం సంతకాలు చేసి 28 తారీఖున సమర్పించాం. ఐతే ఇక్కడో విషయం నాకు అర్దం కావట్లేదు. తిరుపతిలో ఉన్న మా ఇంటికి నోటీసుల వచ్చాయి అనగానే తమన్.. నేను మాత్రం మీ అడ్రస్ ఇవ్వలేదు అన్నాడు. దాంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. అన్ని సమస్యలను దాటుకుని మీ ముందుకు వచ్చి ఈ రోజు గాడ్ ఫాదర్ దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందని” ఆయన పేర్కొన్నారు.