సరోగసి.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ విధానం ద్వారా పిల్లల్ని కంటున్న వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు హీరోయిన్స్ కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. గతేడాది జనవరిలో ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వారికి అమ్మాయి పుట్టగా మాల్తీ అని నామకరణం చేశారు. ఆ సమయంలో ప్రియాంక చోప్రాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అందం తగ్గిపోతుందనే ఆమె సరోగసి ద్వారా బిడ్డని కనిందంటూ కామెంట్ చేశారు. అయితే తొలిసారి ప్రియాంక ఈ విషయంపై స్పందించింది.
ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్తీ జననం, ఆ సమయంలో వచ్చిన ట్రోల్స్ ఇలా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. “మాల్తీ పుట్టిన సమయంలో నేను కూడా ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నాను. పుట్టినప్పుడు మాల్తీ నా చేయి కంటే చిన్నగా ఉంది. కొన్నిరోజులు ఇంటెన్సివ్ కేర్ విభాగంలోనే ఉంచాం. ఆ సమయంలో మాల్తీని చూస్తూ నేనూ- నిక్ ఎంతో బాధపడేవాళ్లం. అలాంటి తరుణంలో మాకు వైద్యులు దేవుళ్లలా కనిపించారు. అసలు మాల్తీ బతుకుతుందని అనుకోలేదు. వైద్యులు దేవుళ్లలా పిల్లలకు ప్రాణాలు పోస్తున్నారు.
నేను సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చానని తెలిసి.. చాలా మంది ట్రోల్ చేశారు. నేను అందం తగ్గిపోతుందని ఈ పద్ధతి ఎంచుకున్నాని అనుకున్నారు. కానీ, నేను సరోగసిని ఎంచుకోవడానికి కారణం నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సరోగసి విధానం అంత తేలిక కాదు. నేను- నిక్ ఆరు నెలలపాటు వెతికాం. తర్వాత ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా పేరు – ఆమె పేరు కలిసొచ్చేలా మాల్తీ అని పేరు పెట్టాం. సోషల్ మీడియా ట్రోల్స్ ప్రభావం నా కూతురిపై పడకూడదనే.. ఆమె ఫొటోలను కూడా రివీల్ చేయడం లేదు” అంటూ ప్రియాకం చోప్రా వ్యాఖ్యానిచింది.