‘మా’ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పోలింగ్ రోజు దాడులు చేసుకునే స్థాయి వరకు వెళ్లింది. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. మొత్తానికి ఎన్నికలు జరిగి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇక్కడితో ఈ గోలకి ముగింపు పడుతుంది అని అందరూ భావించారు. కానీ పోలింగ్ రోజు మోహన్‌బాబు తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో మా కథలో కొత్త మలుపు చోటు చేసుకుంది.
దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయిందని, ఆ పుటేజ్‌ను ఇవ్వాలని ప్రకాశ్‌రాజ్ ఎన్నికల అధికారిని కోరడం, దానికి ఆయన నిరాకరించడంతో సీసీ టీవీ సర్వర్ రూమ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సోమవారం పోలింగ్ జరిగిన జూబ్లీహిల్స్‌లోని స్కూల్‌కు వచ్చిన ప్రకాశ్‌రాజ్ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హీరో తనిష్‌పై దాడి జరిగినట్లు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జూబ్లీహిల్స్ స్కూల్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: లైవ్‌లో బోరున విలపించిన బెనర్జీ..