తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగి.. ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు సుమన్. అప్పట్లో యాక్షన్ చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు సుమన్. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సుమన్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కొంతకాలం ఆయన జైలు జీవితం అనుభవించారు. ఆ సమయంలో ఆయన మానసికంగా ఎంతో కృంగిపోయినట్లు పలు సందర్భాల్లో తెలిపారు. ఈ కేసులో ఆయనను అక్రమంగా ఇరికించినట్లు తేలడంతో నిర్ధోషిగా ఆయనను విడుదల చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ లో ఏ హీరో హెల్ప్ చేయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్ లో కొంత మంది ప్రొడ్యూసర్లు కష్టకాలంలో ఆదుకున్నారు. అయితే నేను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో హీరోల వైపు నుంచి ఎలాంటి సహాయం లభించలేదు. హీరోయిన్లు మాత్రం నాకోసం స్టాండ్ తీసుకున్నారు. సుమలత, సుహాసని, భాను ప్రియ లాంటి హీరోయిన్లు సుమన్ చాలా మంచివ్యక్తి.. క్రమశిక్షణతో ఉండేవాడని.. అతని బ్యాడ్ టైమ్ వల్ల ఇలా జరిగిందని స్టేట్ మెంట్ ఇవ్వడం నాకు ఎంతో ప్లస్ పాయింట్ అయ్యింది.
నా కెరీర్ లో ఏ హీరో వద్దకు సహాయం కోసం వెళ్లలేదు.. దేవుడి దయవల్ల నాకు మంచి చాన్సులు వచ్చాయి.. హీరోగా నేనేంటో నిరూపించుకోగలిగాను. నేను పెద్ద హీరోలతో నటించినప్పటికీ వారి సలహాలు.. సూచనలు మాత్రమే తీసుకునేవాడిని. అప్పట్లో శోభన్ బాబు కూతురు మా అమ్మ స్టూడెంట్.. ఆమె ఎన్నో సందర్భాల్లో మా ఇంటికి స్పెషల్ క్లాసులకు వచ్చివెళ్లేవారు. ఆ సమయంలో నేను ఇండస్ట్రీకి రాలేదు. హీరోగా నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ పలుకుబడి ఏమీ ఉపయోగించుకోలేదు.
శోభన్ బాబు తో దోషి-నిర్దోషి సినిమాలో నటించాను.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అలాగే హీరో కృష్ణ కూతురు కూడా మా అమ్మ కాలేజిలోనే చదివేవారు. ఇక కృష్ణం రాజు అయితే నన్ను సొంత తమ్ముడిగా చూసుకునేవారు. ఏ ఫంక్షన్ అయినా నన్ను ప్రత్యేకంగా పిలిచేవారు.. అప్పట్లో ఆయనకు ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉండేది. అలా అని నేను ఎవరి పలుకుబడి తీసుకొని హీరోగా రాణించాలని అనుకోలేదు. నా సొంత కష్టంతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను అంటూ తన జీవితంలో విశేషాలు గురించి తెలిపారు సుమన్.