తారకరత్న మృతిపట్ల తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు ప్రముఖులు తారకరత్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తారకరత్న మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నందమూరి తారకరత్న మృతితో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా ప్రేక్షకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న హీరో వరకు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నారా లోకేష్- బ్రాహ్మణి తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పంచారు.
బెంగళూరు నుంచి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ లోని నివాసానికి తరలించిన విషయం తెలిసిందే. ప్రముఖులు, రాజకీయ నేతలు తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. విజయసాయిరెడ్డి, చంద్రబాబు తారకరత్న పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులు అర్పించారు. విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతాడని అందరికీ తెలిసిందే. కుటుంబ పెద్దగా చంద్రబాబు- విజయసాయిరెడ్డికి ధైర్యం చెప్పారు. నారా లోకేష్- బ్రాహ్మణి దంపతులు కూడా తారకరత్న నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. నారా లోకేష్ బావ భౌతికకాయం చూస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
నారా లోకేష్- తారకరత్న మధ్య మంచి అనుబంధం ఉంది. తారకరత్నను గుర్తుచేసుకుని లోకేష్ భావోద్వేగబరిత పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. “బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ తేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.” అంటూ నారా లోకేష్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.