సూపర్ కృష్ణ మరణంతో తెలుగు సినిమా పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. సినిమా పరిశ్రమలో అద్భుతాలకు నాంది పలికిన ఓ శకం ముగిసింది. తెలుగు పరిశ్రమలో మంచితనానికి ఆయన చిరునామాగా నిలిచారు. ఎన్నో మంచి పనులు చేశారు. తెలిసి చీమకు కూడా అపకారం చేయని మనస్తత్వం ఆయనది. నిర్మాతల పాలిట కల్పవల్లిగా నిలిచారు. తాను నష్టపోయినా పర్వాలేదు.. ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకూడదని భావించే వారు. ప్రతిభ ఉన్న వ్యక్తులను ఎప్పుడూ నెత్తిన పెట్టుకునే వారు. వారికి సముచిత స్థానం ఇచ్చేవారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే గతంలో మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు. ఓ సందర్భంలో శ్రీశ్రీ మాట్లాడుతూ కృష్ణ వ్యక్తిత్వం గురించి చెప్పారు.
‘‘ నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ క్లిప్ చదువుతున్న నెటిజన్లు.. కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా, గుండె పోటు కారణంగా సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయమే ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ప్రముఖుల సందర్శన అనంతరం పద్మాలయ స్టూడియోకు తీసుకువచ్చారు.
అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పెద్ద సంఖ్యలో స్టూడియోకు చేరుకుంటున్న అభిమానులు కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణ భౌతిక దేహాన్ని అభిమానుల సందర్శన కోసం ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక, కృష్ణకు నివాళులు అర్పించటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పద్మాలయ స్టూడియోకు రానున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.