బుర్రిపాలెం బుల్లోడు.. ఆంధ్ర జేమ్స్‌బాండ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండెపోటుతో సోమవారం ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కన్ను మూశారు. వెండితెరపై సుమారు 340కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక సినీ పరిశ్రమలో కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేయలేదు. సినీ ప్రస్థానంలో ఆయన కథానాయకుడిగా మాత్రమే కాక.. నిర్మాతగా.. పద్మాలయ స్టూడియోకి అధినేతగా కూడా వ్యవహరించారు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత కృష్ణకే దక్కింది.
ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. కృష్ణకు ఐదుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు కాగా.. కుమార్తెలు ప్రియదర్శిని, మంజుల, పద్మావతి. ఇక కృష్ణ సంతానం మాత్రమే కాక.. ఆయన అల్లుళ్లు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కొడుకులు-కోడళ్లు, కుమార్తెలు-అల్లుళ్లు, మనవలు-మనవరాళ్లతో.. సంతోషంగా గడిపారు కృష్ణ. అయితే ఆయన జీవితంలో నాలుగు కోర్కెలు మాత్రమే అలాగే తీరకుండా మిగిలిపోయాయి. అవేంటంటే..
తెలుగు ప్రేక్షకులకు అల్లూరి సీతారామరాజు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. అల్లూరి పాత్రలో కృష్ణ అద్భుతంగా నటించారు అనడం కన్నా జీవించారు అనడం కరెక్ట్. ఆ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత.. కృష్ణ మనసు పడ్డ మరో పాత్ర.. ఛత్రపతి వీర శివాజీ. కృష్ణ ఓ సినిమాలో శివాజీ పాత్రలో నటించారు. అయితే.. అది పూర్తిస్థాయి పాత్ర కాదు. కాసేపు మాత్రమే.. ఆ పాత్రలో నటించారు. ఆ సినిమా ‘చంద్రహాస’. అయితే, కృష్ణకు శివాజీ పాత్ర అంటే చాలా ఇష్టం.
అందుకని, ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత మహారథితో శివాజీ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట కృష్ణ. ఆ ప్రాజెక్ట్ మీద కొంత వర్క్ కూడా చేశారు. అయితే.. ఆ సినిమా వలన మత ఘర్షణలు చెలరెేగుతాయేమోననే సందేహంతో దాన్ని మధ్యలో వదిలేశారు. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో వెండితెరపై పూర్తిస్థాయిలో కనిపించాలనే కోరిక తీరకుండా పోయింది. ఆ తర్వాత ఆ అవకాశం కూడా రాలేదు.
తెలుగు తెరకు జెమ్స్‌బాండ్ తరహా గూఢచారి పాత్రని పరిచయం చేసింది కృష్ణే. గూఢఛారి 116, రహస్య గూఢచారి వంటి చిత్రాల్లో నటించాడు కృష్ణ. అందుకని, ఆయనను ఆంధ్రా జేమ్స్ బాండ్ అనేవారు. తనలానే కుమారుడు మహేష్ బాబును కూడా జేమ్స్ బాండ్‌గా చూడాలని కృష్ణ ఆశ పడ్డారు. అయితే తండ్రి చేసిన పాత్రలు.. సినిమాలు రీమేక్ చేయడానికి మహేష్ పూర్తిగా వ్యతిరేకం. కాకపోతే.. ఇక మహేష్ తన కెరీర్‌లో కౌ బాయ్‌గా నటించిన చిత్రం ‘టక్కరి దొంగ’. దీనిలో కృష్ణ కూడా నటించారు. అయితే టక్కరి దొంగ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో మహేష్ బాబు.. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆ తరహా పాత్రలు చేయలేదు. దాంతో కుమారుడు మహేష్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనే కృష్ణ కోరిక తీరకుండానే మిగిలిపోయింది.
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకి ఉన్న క్రేజ్.. అది క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో ఆ షో సూపర్ సక్సెస్ కావడంతో.. తెలుగు సహా పలు భాషాల్లో ఆ షోని స్టార్ట్ చేశారు. అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కేబీసీ షో చూసిన కృష్ణ.. తనకు కూడా అటువంటి షో చేయాలని ఉందని ఓ సందర్భంలో తన మనసులో మాట వెల్లడించారు. అంటే.. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అని కాదు, అటువంటి కొత్త కాన్సెప్ట్‌తో ఎవరైనా టీవీ షో ఆఫర్‌తో తన దగ్గరకు వస్తే చేస్తానన్నారు. బుల్లితెరపై షోలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపారు కృష్ణ.
అయితే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే తెలుగు బుల్లితెర మీద ఆ షో స్టార్ట్ అయ్యే సమయానికి కృష్ణ నటనకు దూరంగా ఉన్నారు. దాంతో బుల్లితెర మీద వ్యాఖ్యాతగా రాణించాలనే కృష్ణ కోరిక అలానే ఉండిపోయింది.
కృష్ణ.. తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. కుమారులు ఇద్దరినీ బాల నటులుగా, ఆ తర్వాత కథానాయకులుగా పరిచయం చేశారు. ఇప్పుడు మనవలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘వన్ నేనొక్కడినే’లో మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దాంతో మనవడితో నటించాలని ఉందని కృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు. కానీ అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేష్‌తో కలిసి మరో సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు.