నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ పొలిటికల్ యాక్షన్ డ్రామా జానర్ లో ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నుండి ఈ సినిమా వస్తుండటంతో.. వీరసింహారెడ్డిపై అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. అఖండ సినిమాను తన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేసిన తమన్.. ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.
వీరసింహారెడ్డిపై అంచనాలు పెరగడానికి బాలకృష్ణ ఒక కారణమైతే.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరో కారణం. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్, బాలయ్య డైలాగ్ ప్రోమో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘జై బాలయ్య’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. ఇందులో కూడా జై బాలయ్య అని టైటిల్ పెట్టేసరికి ఫ్యాన్స్ లో సాంగ్ పై ఎక్సయిట్ మెంట్ పెరిగిపోయింది. అయితే.. ఈ జై బాలయ్య సాంగ్.. వీరసింహారెడ్డిగా బాలయ్య క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ.. డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
మాస్ సినిమా కాబట్టి.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పొలిటిషన్ గా, ఊరిపెద్దగా.. బాలయ్య జనాలతో ఎలా ఉంటాడో ఇందులో చూపించారు. లిరికల్ సాంగ్ అయినప్పటికీ, బాలయ్యను డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. దాదాపు బాలయ్యని సినిమాలో ఊరిజనం దేవుడిలా భావిస్తారని చెప్పకనే చెప్పారు. తమన్ మ్యూజిక్ కి అనుగుణంగా లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన పదాలను పాటలో కూర్చాడు. రాజసం నీ ఇంటిపేరు.. పౌరుషం నీ ఒంటి తీరు అనే లైన్స్.. సీమ నెత్తురు ఎలా ఉంటుందో చెప్పిన రచయిత.. జనాలు జై బాలయ్య అంటూ ప్రేమగా పిలుచుకుంటారని తెలిపిన తీరు బాగుంది.
ఇక ఈ పాటను కరీముల్లా అనే కొత్త సింగర్ పాడాడు. మనకి ఇంతకుముందు ఇలాంటి హీరో ఇంట్రో సాంగ్ లను కైలాష్ ఖేర్ తో పాడించేవారు. కరీముల్లా వాయిస్ వింటే.. ఇకపై కైలాష్ ఖేర్ అక్కర్లేదేమో అనిపిస్తుంది. టోటల్ సాంగ్ లో బాలయ్యను తలచుకుంటూ ఓ ఊరి జనం జాతర చేసుకోవడం చూడవచ్చు. సాంగ్ కి కూడా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా హుషారైన సంగీతం అందించాడు తమన్. ఇటీవల వారసుడులో రంజితమే సాంగ్ తో విజయ్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసిన తమన్.. ఇప్పుడీ జై బాలయ్యతో మరోసారి నందమూరి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఈ సాంగ్ ని వీరసింహారెడ్డి మాస్ ఆంథెమ్ గా రిలీజ్ చేయడం విశేషం. జై బాలయ్య అనే నినాదాన్ని ఫ్యాన్స్ ఇంకొంత కాలం మర్చిపోకుండా ఉండేలా చేశారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉండగా.. ఈ సాంగ్ ట్యూన్ ని తమన్.. సింహరాశి సినిమాలో ‘పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు’, భరత్ అనే నేను సినిమాలోని ‘వచ్చాడయ్యో సామి’ సాంగ్స్ నుండి కాపీ చేశాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ జై బాలయ్య పాటలో బాలకృష్ణ గెటప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. వీరసింహారెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ కి తగ్గట్టుగానే.. బాలయ్య మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్, వైట్ అండ్ వైట్ డ్రెస్, కళ్లద్దాలు అలా స్టైలిష్ లో లుక్ అదరగొట్టారు. ఇదే పాటలో తమన్ కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. సాంగ్ లో సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ పనితనం, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రిచ్ ప్రొడక్షన్ డిజైన్ అట్రాక్ట్ చేస్తోంది. కాగా.. మొత్తానికి ఈ జై బాలయ్య మాస్ ఆంథెమ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించడం ఖాయమనే అనిపిస్తుందని సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ జై బాలయ్య వీడియో ట్రెండ్ మొదలైంది.