మన జీవితంలో మరో ఏడాది ముగింపునకు వచ్చేసింది. ఎప్పుడైపోయిందో, ఎలా అయిపోయిందో తెలియకుండానే ఎన్నో మంచి మంచి అనుభూతులని గుర్తులుగా మిగుల్చుతూ చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమైపోయింది. గత రెండేళ్లు, కరోనా వల్ల సినిమాలని చాలావరకు ఓటీటీల్లోనే చూడాల్సి వచ్చింది. కానీ ఈ ఇయర్ మాత్రం అలా కాదు.. తిరిగి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు, పలు బ్లాక్ బస్టర్-హిట్ సినిమాల్ని చూస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా రేంజ్ లో పదుల సంఖ్యలో మూవీస్ మనల్ని మెస్మరైజ్ చేశాయి. ఇంతకీ ఈ ఏడాది మనల్ని మైమరపించిన ఆ చిత్రాలేంటి? వాటి సంగతేంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. లేవడం, తినడం, నిద్రపోవడం అనేవి మన జీవితంలో ఎలా భాగమైపోయాయో సినిమా చూడటం అనేది కూడా మనకు ఓ అలవాటైపోయింది. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లనే తీసుకుంటే సినిమా అనేది ఓ వ్యసనం. మూవీస్ చూసి వదిలిపెట్టేయరు. అందులో హీరోహీరోయిన్లని అభిమానిస్తారు. వీలైతే గుడి కట్టేస్తారు. ఒకవేళ కంటెంట్ నచ్చకపోతే మాత్రం ఎంత పెద్ద స్టార్ ఉన్నాసరే పట్టించుకోరు. ఇక కరోనా వచ్చి వెళ్లిన తర్వాత కంటెంట్ బేస్డ్ సినిమాలు లేదంటే భారీ బడ్జెట్ చిత్రాలకే ఓటేస్తూ వచ్చారు. అలా ఈ ఏడాది దాదాపు 77 సినిమాల్ని బాగా ఆదరించారు. ఇప్పుడు ఆ మూవీస్ జాబితాను ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్ ఫామ్ బుక్ మై షో రిలీజ్ చేసింది.
‘బుక్ మై షో’ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం.. ఇక ఈ ఏడాది అదిరిపోయే రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిన సినిమా ‘కేజీఎఫ్ 2’. అంచన్లాలేకుండా రిలీజై ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. సీక్వెల్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ రోజు.. బుక్ మై షోలో ఏకంగా 21 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. బయట కూడా మరిన్ని లక్షలు టికెట్స్ అమ్మి ఉండొచ్చు. ఇక ఎక్కువ సేల్ అయిన టికెట్స్ ప్రకారం చూసుకుంటే.. టాప్ లో ‘కేజీఎఫ్ 2’ ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఆర్ఆర్, కాంతార, ద కశ్మీర్ ఫైల్స్, పొన్నియన్ సెలన్వ్ 1, బ్రహ్మాస్త్ర, విక్రమ్, దృశ్యం 2(హిందీ), భూల్ భులయ్యా 2, డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ ఉన్నాయి. ఇక ఈ ఏడాది జాబితాలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. సరే ఇదంతా పక్కనబెడితే.. పైన చెప్పిన సినిమాలతో పాటు ఈ ఏడాది రిలీజైన వాటిలో మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేసిన సినిమా ఏంటనేది దిగువన కామెంట్ చేయండి.