నటీనటులు క్యాన్సర్ బారిన పడటం అప్పుడప్పుడు జరుగుతుండేదే! ఈ వ్యాధి సోకిందనే విషయాన్ని వాళ్లు పెద్దగా దాచుకోరు. దాచినా అది దాగదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం కెరీర్ ఇబ్బందుల్లో పడే ఛాన్సు ఉంది. ఈ వ్యాధి వచ్చినా సరే ధైర్యంగా నిలబడి దాన్ని జయించినా వారిలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, గౌతమి, మమతా మోహన్ దాస్ లాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. ఇక తనకు క్యాన్సర్ వచ్చిందని ప్రముఖ హీరోయిన్ బయటపెట్టింది. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి మరీ రివీల్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయికి చెందిన రోజ్లిన్ ఖాన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పెటా తరఫున రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేది. ఐపీఎల్ కోసం ఫొటోషూట్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో కీపింగ్ చేస్తూ, బ్యాటింగ్ ఆడుతున్న కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక సినిమాలకొస్తే.. 2012లో ‘దమా చౌడ్కీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ‘సవితా బాబీ’, ‘జీ లేనే దో ఏక్ పల్’ లాంటి సినిమాలు చేసింది. బుల్లితెరపైనా ‘క్రైమ్ అలర్ట్’ షోలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు బ్రాండ్స్ కి మోడల్ గా చేస్తూ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో తనకు క్యాన్సర్ వచ్చిందని ధైర్యంగా చెప్పింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
‘బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాల్ని అప్పగిస్తాడు. ఇది నా జీవితంలో ఓ భాగం మాత్రమే. నమ్మకంతో ముందుకు సాగడమే. ప్రతి ప్రాబ్లమ్ నన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇది కూడా అంతే. నేను త్వరగా కోలుకోవాలని కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికైతే మెడనొప్పి, బ్యాక్ పెయిన్ తప్పించి ఏం లేదు. ఫస్ట్ ఇది జిమ్ వల్ల వచ్చిన నొప్పి అనుకున్నాను. ఏదైతేనేం ప్రారంభంలో దీన్ని గుర్తించగలిగాం. డియర్ బ్రాండ్స్.. ప్రతి నెల 2వ వారం షూట్ కి అందుబాటులో ఉంటాను. రాబోయే ఏడు నెలల్లో ప్రతినెలా కీమోథెరపీ చేయించుకోవాలి. ప్రతి సెషన్ తర్వాత వారం రెస్ట్ కావాలి. మీకు బాల్డ్ మోడల్ తో పనిచేయాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతానికైతే రోజుకోసారి లైవ్ లోకి వస్తాను’ అని రోజ్లిన్ ఖాన్ పోస్ట్ పెట్టింది.