తెలుగుతో పాటు పలు సౌత్ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు నటి భావనా మీనన్. కేరళలోని త్రిస్సూరులో జన్మించిన ఈ బ్యూటీ.. ‘నమ్మల్’ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ‘జాకీ’ అనే కన్నడ మూవీతో ఆమె క్రేజ్ సంపాదించారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, మలయాళంలోకి కూడా అనువాదం అయ్యింది. యాక్షన్ హీరో గోపీచంద్ సరసన యాక్ట్ చేసిన ‘ఒంటరి’ సినిమాతో టాలీవుడ్‌లోకి భావన ఎంట్రీ ఇచ్చారు. 2008లో విడుదలైన ఈ మూవీ ఆశించిన మేర హిట్ అవ్వకపోవడంతో భావనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘మహాత్మా’ చిత్రంతో భావనకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కింది. క్రియేటివ్ జీనియర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘నీలపూరి గాజుల ఓ నీలవేణి’ పాట అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. ఈ సినిమాలో భావన డ్యాన్సులు, అందం, తనదైన మార్క్ నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో భావన నటించారు. అలాంటి ఈ క్రేజీ హీరోయిన్ మీద 2017, ఫిబ్రవరి నెలలో లైంగిక దాడి జరిగింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ దాడి నిందితుల్లో మలయాళ హీరో దిలీప్ పేరు కూడా వినిపించింది. దీంతో దిలీప్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
లైంగిక దాడి జ్ఞాపకాల నుంచి బయట పడటానికి భావనకు చాలా టైమ్ పట్టింది. చాన్నాళ్లు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె తిరిగి మూవీస్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ప్రేమందామ్ను’, ‘పింక్ నోట్’, ‘కేస్ ఆఫ్ కొందాన’, ‘హంట్’ చిత్రాలకు భావన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిల్లో ‘హంట్’ మినహా మిగిలిన సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదిలాఉండగా.. భావన చిన్నప్పటి ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె బాల్యంలోనూ ఎంతో అందంగా ఉన్నారని ఈ ఫొటోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ క్యూట్ బ్యూటీ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి.