తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్లలాంటోళ్లు! ఎందుకంటే సినిమా బాగుంటే చాలు అందులో హీరో ఎవరు? ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశాడా అనేది అస్సలు పట్టించుకోరు. గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా టాలీవుడ్ అక్కున చేర్చుకున్న మూవీస్ లో ‘బిచ్చగాడు’ ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన విజయ్ ఆంటోని.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. కోట్లకు కోట్లకు కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు అదే హీరో విజయ్ కు షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరిగింది.
ఇక విషయానికొస్తే.. సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ ఆంటోని తెలుగులోనూ శ్రీకాంత్ ‘మహాత్మ’కు పనిచేశాడు. అయితే ‘నకిలీ’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమాలు అరడజనుకు పైనే ఉన్నాయి. ఈ ఏడాది అవన్నీ థియేటర్లలోకి వచ్చే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకులకు.. ‘బిచ్చగాడు’ సినిమా వల్లే విజయ్ పరిచయమయ్యాడు. అమ్మ సెంటిమెంట్ తో తీసిన ఈ మూవీలో బిచ్చగాడు క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. ఆడియెన్స్ మనసుల్ని పిండేశాడు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ ని ప్రస్తుతం తీస్తున్నారు. మలేసియాలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ విజయ్ నే కావడం విశేషం.
తాజాగా మలేసియాలో షూటింగ్ సందర్భంగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్ లోని ‘బిచ్చగాడు 2’ సెట్ లోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. విజయ్ వాటర్ బోట్ లో ప్రయాణిస్తుండగా, ఓ టైంలో అది అదుపు తప్పి కెమెరామేన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే హీరో విజయ్ తోపాటు హీరోయిన్ పల్లవి జోషికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు కూడా సేఫ్ గానే ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెల్లగా కోలుకుంటున్నారని సన్నిహితులు చెప్పారు. అయితే ఈ ప్రమాదం జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రముఖ హీరో విజయ్ ఆంటోని ప్రమాదం, గాయపడటంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.