కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ సినిమాపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీలో వ్యతిరేకత వస్తోంది. హీరో నాని ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించగా.. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు.
కేజీఎఫ్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు మంచి కంటెంట్ ఉండదని, మంచి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వవని, ప్రేక్షకులు గానీ, కమర్షియల్ దర్శకులు గానీ పెద్దగా ఆదరించరని అర్ధం వచ్చేలా వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని కుదిపేశాయి. అయితే దీనికి పలువురు సినీ ప్రముఖులు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. దసరా మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో నాని.. వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. కమర్షియల్ హీరోలు, కమర్షియల్ సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ నిలబడదని.. కమర్షియల్ సినిమాల వల్లే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ అవుతుందని అన్నారు.
ఇక తాజాగా హరీష్ శంకర్ కూడా వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను పెరుగన్నంతోనూ.. కమర్షియల్ సినిమాలను బిర్యానీతోనూ పోలుస్తూ మహా వ్యాఖ్యలకు సెటైర్లు విసిరారు. ‘పెరుగన్నం ఆరోగ్యానికి మంచిదే. కానీ అందరూ బిర్యానీ ఎక్కువ తింటున్నారు ఏంటి, నా పెరుగన్నం తినట్లేదు ఏంటి అని అనకూడదు. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి రెండూ అమ్ముతాం కాబట్టి బిర్యానీ తినండి, ఆ తర్వాత పెరుగన్నం తినండి ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. మనకి రెండూ అమ్ముడుపోవాలి అంటూ కామెంట్స్ చేశారు. అటు మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఇటు కమర్షియల్ సినిమా రెండూ అమ్ముడుపోవాలి అని హరీష్ శంకర్ అన్నారు.
ఒక మనిషిని పొగడాలి అంటే ఇంకో మనిషిని ఎందుకు తక్కువ చేయాలనేది ఈరోజుకి అర్ధం కాని విషయం అని, బలగం, మల్లేశం, శతమానం భవతి వంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రతిసారీ కమర్షియల్ డైరెక్టర్లు, మాస్ డైరెక్టర్లు ముందుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. మనకి మనమే గీతలు గీసుకుంటున్నామని, మనమంతా ఒక కుటుంబం అని అన్నారు. అది కేజీఎఫ్ అవ్వచ్చు, ఆర్ఆర్ఆర్ అవ్వచ్చు. ఒక సినిమా హిట్ అయితే మేమందరం సెలబ్రేట్ చేసుకుంటాం. మేమంతా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే బయ్యర్ల దగ్గర డబ్బులున్నాయి. నా ముందు సినిమా హిట్ అయితే బయ్యర్లకు డబ్బులొస్తాయి. నా సినిమాని మంచి రేటు ఇచ్చి కొంటారు. అందుకు వేరే సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాం తప్ప వేరే ఏదీ కాదని అన్నారు.
కొంతమంది పక్కోడి సినిమా పోతే చప్పట్లు కొడతారు. అది కామన్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని. ఇండస్ట్రీ బాగా ఉండాలి. మన సినిమా బాగా ఆడాలి అంటే అంతకు ముందు రిలీజ్ అయిన సినిమా కూడా బాగా ఆడాలి. ఇది బిజినెస్, లౌక్యం తెలిసిన వాళ్ళకి బాగా అర్ధమవుతుంది అంటూ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బలగం సక్సెస్ మీట్ లో భాగంగా హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి హరీష్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీఅభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.