మీరు కొత్త సినిమా ఎక్కడ చూస్తారు? అని మిమ్మల్ని అడగ్గానే.. థియేటర్ కి వెళ్లి చూస్తాం అని గర్వంగా చెబుతారు. కానీ మీరు కాకపోవచ్చు గానీ చాలామంది మాత్రం పైరసీ సైట్స్ లో ఎంచక్కా కొత్త సినిమాలు చూసేస్తుంటారు. ఇక టెలిగ్రామ్ అనే థర్డ్ పార్టీ యాప్ లోనూ మూవీస్ డౌన్ లోడ్ చేసుకుని డబ్బులు మిగిలేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా పైరసీ మూవీస్ చూస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్త పడండి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అయిపోతాయి. మేం చెప్పింది విన్నారా సరేసరి, లేదంటే మీ ఇష్టం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైరసీ సైట్స్, వాటిలో చూసే మూవీస్ విషయంలో ఎవరెంత హెచ్చరించినా సరే చాలామంది వాటి గురించి అస్సలు పట్టించుకోరు. ఇక టెలిగ్రామ్ యాప్ ని కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు చాలామంది ఉపయోగిస్తుంటారు. ఇది పేరుకే మెసేజింగ్ యాప్ అయినప్పటికీ. ఇందులో పైరసీ మూవీస్, అసభ్య వీడియోలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు గ్రూప్స్ క్రియేట్ చేసి మరీ కొత్త సినిమాలు రిలీజైన వెంటనే షేర్ చేస్తుంటారు. థియేటర్, ఓటీటీ.. ఎక్కడ రిలీజైన సినిమా, సిరీస్ ఏదైనా సరే ఈ యాప్ లో నిమిషాల్లో ప్రత్యక్షమవుతుంది. వీటిలో చూసేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇప్పుడు వాళ్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సినిమా లింక్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి వైరస్ లు పంపిస్తున్నారు. ఓటీపీ, మెసేజ్ లు ఏం లేకుండా మీ బ్యాంక్ ఖాతాల్ని ఊడ్చి పారేస్తున్నారు.
గతంలో సినిమా డౌన్ లోడ్ చేసుకోవాలంటే లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అయిపోయేది. కానీ గత కొన్నిరోజుల నుంచి మాత్రం సెట్టింగ్స్ చాలా మారిపోయాయి. మూవీ డౌన్ లోడ్ కోసం లింక్ కి బదులు డౌన్ లోడ్ బటన్ వస్తుంది. కొద్దిసేపు ఆగి.. మనకు కనిపించిన డౌన్ లోడ్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సెట్టింగ్ తోనే హ్యాకర్స్.. వైరస్, మాల్వేర్ ను ఫోన్లలోకి పంపుతున్నారు. మీకు అది వచ్చినట్లు కూడా తెలియదు. అలానే మీ పర్సనల్ డేటా అంతా కూడా హ్యాకర్ల చేతికి వెళ్లే ఛాన్సు ఉంది. గతేడాది ఇలా టెలిగ్రామ్ లింక్స్ క్లిక్ చేసిన దాదాపు 50 వేల మంది.. రూ.95 కోట్లపైనే పోగొట్టుకున్నారు. పైరసీ నేరం కాబట్టి.. వీళ్లలో చాలామంది పోలీసులకు కంప్లైట్ చేయడానికి కూడా భయపడుతున్నారట. మరి మీలో ఎవరి డబ్బులైనా ఇలా పోయావా? అప్పుడు మీరేం చేశారు? వీలైతే కింద కామెంట్స్ లో మీ అనుభవాన్ని పంచుకోండి.