సినిమా ప్రపంచంలో ఆస్కార్ అవార్డులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వాళ్లు ఆస్కార్ అవార్డు అందుకోవటమే తమ జీవిత లక్ష్యంగా భావిస్తుంటారు. అమెరికాలో ప్రతీ ఏటా ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతూ ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి నామినేట్ అయిన సినిమాల్లోంచి విజేతలను ప్రకటిస్తూ ఉంటారు. త్వరలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి ఇప్పటికే వడపోత కార్యక్రమం పూర్తయింది. అన్ని భాగాల్లో కొన్ని సినిమాలను నామినేట్ చేశారు. ఇండియాకు చెందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు కూడా ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట నామినేషన్స్‌లో నిలిచింది. ఇక, ఆస్కార్ అవార్డు నామినేషన్స్‌లో ‘‘ఎవిరిథింగ్ ఎవిరీవేర్ ఆల్ ఆట్ వన్స్’’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా మొత్తం 11 క్యాటగిరీల్లో నామినేషన్స్‌ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాను అమెరికాకు చెందిన డేనియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ తెరకెక్కించారు. వీరు ఈ సినిమాను ప్రముఖ యాక్షన్ హీరో జాకీచాన్‌తో చేద్దామని భావించారు. అయితే, అది కుదరలేదు. దీంతో స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి చైనీస్ లేడీ స్టార్ మిచెల్లె యోతో తీశారు. ఈ సినిమా కామెడీ డ్రామాగా తెరకెక్కింది. థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమా ఆస్కార్లో 11 నామినేషన్లతో పాటు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆరు నామినేషన్స్‌ను సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా యో అవార్డును గెలుచుకుంది. అంతేకాదు.. 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఏకంగా 14 నామినేషన్లకు ఎంపిక కాగా.. ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు.. మరికొన్ని సినిమా అవార్డులకు కూడా ఈ సినిమా ఎంపికైంది. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.