తమిళ, తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన రెండు సినిమాలు విడుదలై ఐదు రోజులైంది. రెండు సినిమాలు మల్టీ స్టారర్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఆ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాల వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో, ఏది టాప్‌లో ఉందో తెలుసుకుందాం.
ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ఒకటి హిందీ మాతృక కాగా రెండవది తమిళ మాతృక, హిందీ మాతృకలో తెలుగు టాప్ హీరో నటిస్తే తమిళ మాతృకలో మరో తెలుగు టాప్ హీరో సందడి చేశాడు. అందుకే ఈ రెండు సినిమాలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అదే రోజు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా విడుదలైంది. అందుకే ఈ రెండు సినిమాల మధ్య పోటీ నడిచింది. కలెక్షన్లలో ఏ సినిమా ఏంత వసూలు చేసింది, ఏ సినిమా టాప్‌లో ఉందో చూద్దాం.
వార్ 2 వీకెండ్ కలెక్షన్లు
వార్ 2 వీకెండ్ కలెక్షన్లు ఇండియాలో 173.60 కోట్లు కాగా హిందీలో 125.5 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగులో 47.2 కోట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 275.74 కోట్లు వచ్చాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 17 వరకు కేవలం నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఇది. మొదటి రోజు 52 కోట్లు కాగా రెండో రోజు 57.35 వసూలు చేసింది. మూడో రోజు 33.25 కోట్లు, నాలుగో రోజు 31 కోట్లు దక్కించుకుంది.
కూలీ వీకెండ్ కలెక్షన్లు
ఇక కూలీ సినిమా ఇండియాలో 194.25 కోట్లు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 397 కోట్లు సాధించింది. ఇందులో తమిళం నుంచి అత్యధికంగా 127.2 కోట్లు రాగా, తెలుగులో 44.75 కోట్లు వచ్చాయి. మొదటి రోజు 65 కోట్లు కాగా రెండో రోజు 54.75 కోట్లు వసూలయ్యాయి. ఇక మూడో రోజు 39.5 కోట్లు, నాలుగో రోజు 35 కోట్లు వచ్చాయి. మొత్తానికి ఇండియాలో కలెక్షన్ల విషయంలో రెండు సినిమాల మధ్య 20 కోట్లు తేడా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లు తేడా ఉంది. వార్ 2 కంటే కూలీ కొద్దిగా ఆధిక్యం ప్రదర్శిస్తోంది.