ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్.. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటప్డడాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్.. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. హోలీ వేడుకల అనంతరం ఫామ్ హౌస్ లోకి వెళ్లిన ఆయన ఆకస్మికంగా మరణించడం సంచలనం రేపింది. ఇక సతీష్ కౌశిక్ మరణంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటప్డడాయి. సంఘటన జరిగిన ఫామ్ హౌస్ లో కొన్ని కీలక ఆధారాలు పోలీసులకు చిక్కాయి.
సతీష్ కౌశిక్.. తన విలక్షణమైన కామెడీతో, విలనిజంతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత మెగాఫోన్ పట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలోనే హోలీ వేడుకల్లో గుండెపోటుకు గురై మరణించాడు సతీష్. అయితే ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. హోలీ వేడుకలను ఓ ఫామ్ హౌస్ లో ప్లాన్ చేశారు కౌశిక్ అతడి మిత్రులు. ఇక ఈ పార్టీకి 10 నుంచి 12 మంది వచ్చినట్లు సమాచారం. వారి జాబితాను కూడా పోలీసులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫామ్ హౌస్ లో నిషేధిత ఉత్పేరిత డ్రగ్స్ లభ్యమయ్యాయి. దాంతో పోలీసులకు ఈ కేసుపై మరిన్ని అనుమానాలు రేకెత్తాయి. ఇక్కడ లభ్యం అయిన డ్రగ్స్ ఎవరి కోసం తీసుకొచ్చారు అనేది ఇప్పుడు పోలీసుల ముందున్న అసలు ప్రశ్న.
ఇక ఈ ఫామ్ హౌస్ కౌశిక్ మిత్రుడు పారిశ్రామిక వేత్త వికాస్ మాలూది. గతంలో ఇతడిపై అత్యాచారం కేసు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సతీష్ మృతి తర్వాత వికాస్ పరారీలో ఉన్నాడు. అయితే వైద్యులు మాత్రం సతీష్ కౌశిక్ గుండెపోటు కారణంగానే మరణించాడని నిర్దారించారు. పూర్తిస్థాయి పోస్ట్ మార్టం నివేదిక వస్తేగానీ అతడి మరణానికి గల కారణాలు కచ్చితంగా తెలుస్తాయి. అయితే గుండెపోటుకు గురై, అతడిని హస్పిటల్ కు తీసుకెళ్లే వరకు పోలీసులకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతో ఈ కేసుపై మరింత అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక హరినగర్ లోని దీన్ దయాళ్ ఆస్పత్రిలో మెడికల్ బోర్డు ద్వారా పోస్టు మార్టం చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.