తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఇక సంక్రాంతి పండుగ అంటే.. రంగురంగుల ముగ్గులు, కోడి పందాలు, భోగి మంటలు ఇవే కాక.. కొత్త సినిమాలు కూడా ఆ జాబితాలో ఉంటాయి. ఈ సారి సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. నట సింహం.. నందమూరి బాలకృష్ణ.. నటించిన వీర సింహారెడ్డి సినిమా.. గురువారం విడుదలయ్యింది. సినిమా విడుదల నేపథ్యంలో.. థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ సందడి చేశారు. ఈ క్రమంలో బాలయ్య కూడా అభిమానులతో కలిసి.. థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
వీర సింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా బాలయ్య.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఓ థియేటర్‌లో సందడి చేశారు. గురువారం ఉదయం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ‘వీరసింహా రెడ్డి’ బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ క్రమంలో.. బాలయ్య.. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి భ్రమరాంబ థియేటర్ వద్దకు చేరుకున్నాడు. దాంతో థియేటర్ దగ్గర సందడి అంబరాన్ని అంటింది. నటసింహం వచ్చిన నేపథ్యంలో.. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పులు, బ్యాండ్‌బాజాలతో తమ అభిమానహీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని, వారి స్పందన బాగుందని ఈ సందర్భంగా బాలయ్య చెప్పుకొచ్చాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా గురువారం వీరసింహా రెడ్డి సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడిగా పని చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో.. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించింది. తమన్ సంగీతం అందించారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.