నటసింహం నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో విడుదలైన మూడో చిత్రం అఖండ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ చిత్రం.. అఖండమైన విజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. బాలయ్య కెరీర్ లోనే అఖండ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే అఖండ విజయాన్ని చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది.
అఖండ హిట్ అయిన సందర్బంగా.. తాజాగా బాలయ్య – బోయపాటి – నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తన సినిమా హిట్టైన ప్రతిసారి బాలయ్య దేవాలయాల దర్శనం చేసుకుంటాడనే సంగతి తెలిసిందే. అయితే.. కనకదుర్గమ్మ దర్శనం అనంతరం బాలయ్య.. సినిమా గురించే కాకుండా ఏపీలో టికెట్ రేట్స్ పై కూడా తన మార్క్ కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ధర్మాన్ని కాపాడితే.. ఆ ధర్మమే మనలను కాపాడుకుంటుందనే విషయాన్ని అఖండ సినిమాలో చూపించాము. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధించింధి.. అందుకే మొక్కులు చెల్లించుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశం ప్రస్తావించగా.. ‘సినిమా టికెట్ల విషయంలో మేము చేయగలిగింది చేశాం. ఆన్లైన్ టికెట్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టి వేసిందనే విషయం నాకు రాత్రే తెలిసింది. దీని పై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసిందని అంటున్నారు. మేము కూడా అన్నింటికీ సిద్ధపడే సినిమాను విడుదల చేశాం. సుప్రీం కోర్టుకు వెళ్లినా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. ఎలాగైనా సినిమా ఇండ్రస్ట్రీని కాపాడుకుంటాం” అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.