నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన ఏం చేసినా సంచలనమే. హీరోగా తెర మీద నవరసాలు పండించినా.. రియల్‌గా మాత్రం భోళా మనిషి.. ఎంతో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. బాలయ్య కోపం, ప్రేమ రెండింటిని సమానంగా స్వీకరిస్తారు అభిమానులు. ఇక ఓటీటీల్లో ఏ స్టార్ హీరో క్రియేట్ చేయలేని రికార్డును బాలయ్య సాధించాడు. ఆహాలో ప్రసారం అయ్యే అన్‌స్టాపబుల్ షో కొత్త బాలయ్యని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇక తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీజంతో ఆ షోని టాక్ షోలకే బాప్‌గా నిలిపాడు బాలయ్య.
ఇక ఈ వయసులోనూ.. కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు బాలయ్య. సినిమాలు, షోలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాగోగులు, సేవా కార్యక్రమాలతో ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతుంటారు బాలయ్య. ఇక తాజాగా ఆయన డైరీలో మరో కొత్త పని చేరింది. అదే యాడ్స్. బాలయ్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 40 ఏళ్ల పైనే అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆయన ఏనాడు యాడ్స్‌లో నటించలేదు. కానీ తొలిసారి ఆ రూల్‌ని బ్రేక్ చేసి.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్‌లో నటించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా బాలయ్య నటించిన సాయిప్రియ యాడ్ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రెండు ప్రకటనలు విడుదల చేశారు. బాలయ్య స్టైలిష్ లుక్, డైలాగ్ డెలివరీ, హావభావాలతో యాడ్స్‌ని రక్తికట్టించారు.
అయితే ఈ యాడ్ కోసం బాలయ్య తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. తొలి యాడ్ కోసం బాలయ్య ఏకంగా 16 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మొత్తాన్ని ఆయన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి విరాళం ఇచ్చారట. ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు సినిమాలతో పాటు యాడ్స్‌లో నటిస్తూ.. కోట్లు ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బాలయ్య రేంజ్‌లో అది కూడా తొలి యాడ్‌కే ఇంత భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్‌గా అందుకున్నవారు ఎవరూ లేరు. యాడ్స్ ద్వారా ఇంత భారీ మొత్తం వస్తుందని తెలిసి కూడా ఇన్నాళ్లు దాన్ని కాదనుకున్నారంటే.. బాలయ్య ఎంత గొప్పవాడో కదా అంటున్నారు ఈ విషయం తెలిసిన జనాలు.
చాలా మంది హీరోలకు సినిమాల్లో నటించినా.. ఇంత భారీ మొత్తం ఇవ్వడం లేదు.. అలాంటిది ఒక్క యాడ్ కోసం బాలయ్యకు 16 కోట్లు ఇవ్వడం అంటే మాటలు కాదు.. అది బాలయ్య రేంజ్.. బ్రాండ్.. అంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక.. ఫీల్డ్ ఏదైనా సరే.. బాలయ్య దిగనంతవరకే.. వన్స్ హీ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య యాడ్ రెమ్యూనరేషన్ మీద జోరుగా చర్చ నడుస్తోంది.