టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాటిస్తే ఎంత దూరమైనా వస్తాడు.. లోపల ఒకటి, బయటికి మరోటి ఉండదు. నమ్ముకున్న వారికోసం ఏమైనా చేసే బాలయ్య గురించి ఇండస్ట్రీలో పెట్టాలన్నా, తిట్టాలన్నా ఆయన తర్వాతే అంటుంటారు. అవన్నీ ఉత్తమాటలు కాదని మరోసారి ప్రూవ్ చేశారు బాలయ్య. స్టార్ హీరోలంతా సినిమాలతో, యాడ్స్ తో రెండు చేతులా సంపాదించేదంతా వెనకేసుకుంటుంటారు. అందులో ఎంతోకొంత సామాజిక సేవల కోసం ఖర్చు చేస్తుంటారు. కానీ.. కొందరు మాత్రమే యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని విరాళం ఇచ్చేస్తుంటారు.
అలాంటి మంచి మనసు కలిగిన స్టార్స్ లో బాలయ్య ముందే ఉంటాడు. అందరు హీరోలు వారి కెరీర్ లో సినిమాలే కాకుండా యాడ్స్ కూడా చేస్తూ వచ్చారు. కానీ.. బాలయ్య ఇన్నేళ్లపాటు ఒక్క యాడ్ కూడా చేయలేదు. రీసెంట్ గా ఫస్ట్ టైమ్ బాలయ్య ఓ కమర్షియల్ యాడ్ లో నటించాడు. రియల్ ఎస్టేట్ కంపెనీ సాయిప్రియ గ్రూప్ కి బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. సాయిప్రియ వారి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ “116 పారామౌంట్” యాడ్ లో.. బాలయ్య తన సినిమాటిక్ స్టైల్ లో డైలాగ్స్ పలికి ప్రమోట్ చేశాడు. అయితే.. ఈ యాడ్ కోసం బాలయ్య దాదాపు రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో యాడ్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని తాను నిర్వహిస్తున్న ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్’కి డొనేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్న బాలయ్య.. ఇప్పుడు యాడ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని హాస్పిటల్, ఇన్స్టిట్యూట్ కే డొనేట్ చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసి బాలయ్య ఫ్యాన్స్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడని.. క్యాన్సర్ బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి. బాలయ్య డొనేట్ చేసిన విషయాన్నీ పాపులర్ యాంకర్ నాగవల్లి తన ఫేస్ బుక్ లో షేర్ చేయడం విశేషం. ప్రస్తుతం బాలయ్య ఓవైపు అన్ స్టాపబుల్ షో.. మరోవైపు వీర సింహారెడ్డి మూవీ చేస్తున్నాడు.