బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆయుష్ ఖాత్రి. బుల్లితెర నటుడిగా ఇతడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్ కా వీర్ పుత్ర మహారాణా ప్రతాప్, సత్రంగి ససురాల్, వీ డిస్ట్రక్షన్, ఏజెంట్ రాఘవ్- క్రైమ బ్రాంచ్ సీరియళ్లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు! దిల్ హై ముస్కిల్ సినిమాలోనూ నటించారు. బుల్లితెర నటుడిగా మంచి ఊపులో ఉండగానే నటనా రంగానికి దూరం అయ్యారు. 2015లో పూర్తిగా కెమెరా ముందుకు రాలేదు. కుటుంబానికి కూడా దూరమైపోయారు. ముంబైలో ఒంటరిగా ఉండిపోయారు. ఆయుష్ ఇలా సినిమాలకు దూరమై, ఒంటరిగా నరకం అనుభవించటం వెనుక ఓ విషాదకరమైన స్టోరీ ఉంది. తన ప్రియురాలి కారణంగానే అతడు అలా అయినట్లు.. సర్వం కోల్పోయినట్లు ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పుకొచ్చాడు.
దీనిపై ఆయుష్ మాట్లాడుతూ.. ‘‘ ఓ ప్రముఖ ఛానల్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఓ అమ్మాయితో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరం కలిసి సహజీవనం చేయటం మొదలుపెట్టాము. అయితే, అదే నా అంతానికి ఆరంభం అని నాకు అప్పుడు తెలియలేదు. నాతో ప్రేమలో ఉన్న ఆ అమ్మాయి చెడు ఆలోచనలతో ఉండేది. ఆమె నా బ్యాంక్ ఖాతాలను చూసుకునేది. నన్ను కంట్రోల్ చేసేది. ఆమె నన్ను నా తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి దూరం చేసింది. అనారోగ్యంతో ఉన్న నా తండ్రి నా గురించి ఆలోచిస్తూ బాధపడేవాడు.
మా అమ్మ నన్ను కలవటానికి వచ్చినపుడు నా ప్రియురాలు ఆమెను వెళ్లగొట్టింది. ఆమెకు క్షుద్ర పూజలు కూడా తెలుసు. నేను ప్రతీరోజూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేవాడ్ని. పని కూడా సరిగా చేయలేకపోయేవాడ్ని. ఓ రోజు డబ్బులు మొత్తం అయిపోయాయి. ఆమె నన్ను వదిలేసింది. నేను ఒంటరి వాడిగా మిగిలిపోయాను. నా స్నేహితులు నా పరిస్థితి చూసి చలించిపోయారు. నన్ను నా ఇంటి దగ్గర విడిచి పెట్టారు. మా అమ్మే నన్ను చూసుకుంది. నేను ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడ్ని. నేను ఆమె కంట్రోల్‌లోకి వెళ్లిపోయాను. నా తల్లి కారణంగా మామూలు మనిషిని అయ్యాను ’’ అని చెప్పుకొచ్చారు.