తెలుగు సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రగతి. అభినయంలోనే కాకుండా అందం, ఫిట్ నెస్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. హీరోయిన్స్ లా ఆమె కూడా ఫిట్ గా ఉండేందుకు గంటలు గంటలు వర్కవుట్లు చేస్తున్నారు. ఫిట్ గా ఉంటే హీరోయిన్ వేషాలు వస్తాయని కాదు కానీ ఆమె ఆరోగ్యంగా ఉంటారని, ఆమెని చూసి కొంతమంది అయినా ఆదర్శంగా తీసుకుంటారని ఆమె ఇలా చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆమె ఈ వర్కవుట్ల వల్లే జనానికి మరింత దగ్గరయ్యారు.ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ వీడియోలు, ఫ్యామిలీ ఫోటోస్, ఇతర ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు.
ఆమెకు ఆమె కూతుర్లే లోకం. మగాడి అండ లేకుండా తానే ఒంటరిగా పోరాటం చేస్తూ పిల్లల్ని ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు ప్రగతి. సినీ ఇండస్ట్రీలో ఒక నటి.. భర్త తోడు లేకుండా కుటుంబాన్ని నెట్టుకురావడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఈ విషయంలో ప్రగతి హార్డ్ వర్క్ కి మెచ్చుకోవాల్సిందే. భర్త లేకుండా ఒంటరిగా జీవించడం అనేది వీరి కుటుంబంలో శాపమో ఏమో తెలియదు గానీ ప్రగతి తల్లి కూడా భర్తను వదిలేసి ఒంటరిగానే జీవించారు. తల్లి బాటలోనే ప్రగతి కూడా ఒంటరిగా జీవించవలసి వచ్చింది. అయితే తాను ఎందుకు తన భర్తను వదిలేయాల్సి వచ్చిందో ప్రగతి చెప్పుకొచ్చారు. సింగిల్ మదర్
అమ్మ సింగిల్ గా ఉన్నారు కదా.. నేను అలా ఉండకూడదు, భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి బతికేద్దాం అన్న దృష్టిలోనే ఉన్నానని, చాలా మటుకు రాజీ పడేందుకు ప్రయత్నించానని ఆమె వెల్లడించారు. అయితే ఒక సమయం వచ్చేసరికి అది సెట్ అవ్వదని అన్నారు. సమాజం ఏమనుకుంటుందో అన్న విషయం పక్కన పెడితే.. పిల్లలకి ఏం చెప్తున్నాం అనేది ముఖ్యం అని అన్నారు. ఆడపిల్లలు కాబట్టి సర్దుకుపోవాలి, భరించాలి అని తాను తన పిల్లల ఉదాహరణ అవ్వకూడదని, ఒక తప్పుడు ఉదాహరణను ఇస్తున్నట్టు అనిపించిందని అన్నారు.
ఆడపిల్లలు కాబట్టి మనం మనం భరించాలి, మనం రాజీ పడాలి అని పిల్లలకు చెప్పడం అనేది తప్పుడు సలహా అని ఆమె అన్నారు. జీవితాంతం సర్దుకుపోవాల్సి వస్తుందని, రాజీ పడాల్సి వస్తుందని, భరించాల్సి వస్తుందనే తాను తన భర్తతో విడిపోవాలి అనుకున్నానని, అందుకే విడాకులు ఇచ్చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తన పిల్లలకు ఒంటరి తల్లిగా గొప్ప ఉదాహరణగా కనబడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.