సాధారణంగా చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు సంబంధించిన పుకార్లు.. షికార్లు చేస్తుంటాయి. ఇదిగో తోక అంటే.. అదుగో పులి అంటారు. పైగా నిప్పు లేనిదే పొగ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. హీరో, హీరోయిన్ల పెళ్లి పుకార్ల నుంచి వారి ఆరోగ్యంపై వచ్చే గాసిప్పుల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక నేటి ఆధునిక కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగాక అగ్నికి ఆజ్యం తోడైనట్లు అయ్యింది. దాంతో ఏ చిన్న విషయం తెలిసినా గానీ అది నిజమో.. కాదో తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. స్వయంగా ఆ హీరోయిన్నే క్లారిటీ ఇచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఇలాంటి వార్తలను నేను చెప్పే వరకు నమ్మోద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్ లు అనారోగ్యం బారిన పడ్డ సంగతి మనందరికి తెలిసిందే. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంటే.. ఆమెపై రకరకాలుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి వార్తలే తాజాగా మరో స్టార్ హీరోయిన్ మీద రావడంతో.. ఈ వార్తలపై స్పందించింది సదరు హీరోయిన్. మమతా మోహన్ దాస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన చింతకాయల రవి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్ దాస్. ఈ క్రమంలోనే ఈమెకు గొంతు క్యాన్సర్ రావడంతో సడెన్ గా ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యింది. అయితే ఈమె చికిత్స తీసుకుంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ.. వారిలో అవగాహన కల్పించేది. సుదీర్ఘకాలం క్యాన్సర్ తో పోరాడి గెలిచింది మమతా మోహన్ దాస్.
ఇక గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై స్పందించింది ఈ చిన్నది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది.”నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలను చూసి.. నా బంధువులు, అభిమానులు నాకు మెసేజ్ లు చేస్తున్నారు. ఇక నన్ను ఇంటర్య్వూలు చేసినట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వార్తలను రాస్తున్నాయి. అయితే ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మళ్లీ క్యాన్సర్ బారిన పడలేదు. మరోసారి క్యాన్సర్ కు లొంగిపోయేందుకు సిద్దంగా లేను. నేను చెప్పేదాక ఇలాంటి వార్తను నమ్మకండి” అంటూ మమతా మోహన్ దాస్ రాసుకొచ్చింది. తాజాగా దిగిన ఫొటోలను జతచేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.