తెలుగు ఇండస్ట్రీలో ఆ తరం హీరోయిన్లలో అంజలీ దేవి, భానుమతి, సావిత్రి, జమున లాంటి గొప్ప నటీమణులతో సమానంగా పేరు తెచ్చుకున్న నటి కేఆర్ విజయ. మద్రాస్ లో ఒక టీవీ షోలో కేఆర్ విజయని చూసిన నటుడు జెమినీ గణేషన్ నువు స్టార్ హీరోయిన్ అవుతావని ప్రోత్సహించారు. కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం ‘కర్పగం’ అనే మూవీతో ఆమె సీనీ రంగ ప్రవేశం చేశారు. ఆ మూవీలో హీరో జెమినీ గణేష్.
కేఆర్ విజయ తన అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించారు. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించి మెప్పించారు కేఆర్ విజయ. ఇక తెలుగు లో ఆమె ఎక్కువగా దేవత పాత్రల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వెండితెరపై ఆమె అచ్చమైన అమ్మవారిలా దర్శనం ఇచ్చేది. ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించిన వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమైన విషయమే.. ఈ క్రమంలో కేఆర్ విజయ సోదరి, కూతుళ్లు కూడా వెండితెరపై నటీమణులుగా స్థిరపడ్డారు. కేఆర్ విజయ సోదరి కేఆర్ సావిత్రి మాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కేఆర్ సావిత్రికి ఇద్దరు కూతుళ్లు అనూష, రాగసుధ ఇద్దరూ ఇండస్ట్రీలో నటీమణులుగా పేరు సంపాదించారు.
నటి కేఆర్ విజయకు ఒక కూతురు ఉండగానే తన చెల్లెలు కూతురు అనుషాను చేరదీసింది. కేఆర్ విజయ కూతురుగా అనూష మాలీవుడ్ లోకి తన 13వ ఏటనే అడుగు పెట్టింది. ఆమె టాలెంట్ చూసి పలువురు దర్శకులు హీరోయిన్ అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగు లో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు, గోల్ మాల్ గోవిందం తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. అందేకాదు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.