సినీ రంగుల ప్రపంచంలో తెరముందు అందరికి ఎంటర్ టైన్ మెంట్ అందించే నటీ నటులు వారి రియల్ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవాలో అబ్బాస్ తన జీవితంలో ఎదుర్కొన్న విషయాలను వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటీనటులు ఆ తర్వాత అవకాశాలు లేక నటన నుంచి కనుమరుగైన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా రంగంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వారు కూడా ఒకానొక దశలో అత్యంత ధీన స్థితిలోకి వెళ్లిన వారిని మనం చూశాం. ఇదే కోవలో నటుడు అబ్బాస్ కూడా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే హీరోగా ప్రేక్షకాదరణ పొందిన నటుడు అబ్బాస్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. తను నటించిన ప్రేమదేశం సినిమా అప్పట్లో సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేసింది. కాగా తాజాగా ఓ ఇటర్య్వూలో పాల్గొన్న నటుడు అబ్బాస్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ లవర్ బాయ్ గా ఫేమస్ అయ్యాడు. ప్రేమదేశం సక్సెస్ తర్వాత అబ్బాస్ కి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో అబ్బాస్ తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో నటించాడు. అప్పటికే స్టార్ హీరోగా చెలామని అయిన అబ్బాస్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో సతమతం అయ్యాడు. ఇక ఇండస్ట్రీలో రాణించడం కష్టంగా బావించిన అబ్బాస్ తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చి.. తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. కాగా ఒకానొక సందర్భంలో డబ్బుల్లేక కుటుంబాన్ని పోషించేందుకు బైక్ మెకానిక్ గా, డ్రైవర్ గా పనిచేశానని ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేశా
యాదృచ్చికంగానే నటనలోకి వచ్చానని 19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమా రంగాన్ని ఎంచుకున్నానని తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో విజయాలు అందుకున్నా.. ఆ తర్వాత ఫ్లాప్స్ తో సినీ అవకాశాలు తగ్గాయని చెప్పారు. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి ఎదుర్కొన్నానని తెలిపారు. నటనపై ఆసక్తి తగ్గి సినిమాలకు దూరమయ్యానని తెలిపారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ వెళ్లానని అక్కడ కుటుంబాన్ని పోషించుకునేందుకు మెకానిక్ గా, ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేశానని తన ఆవేదనను చెప్పుకున్నారు.
ప్రేమ విఫలంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా
అబ్బాస్ తన స్కూల్ డేస్ లో జరిగిన విషయాలను పంచుకున్నారు. తను టెన్త్ లో ఫెయిలైనప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, అదే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి దూరమవ్వడంతో ఆ ఆలోచన మరింత బలపడిందని తెలిపారు. ఈ క్రమంలో ఓ రోజు వేగంగా వస్తున్న వెహికిల్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, కానీ డ్రైవర్ జీవితం చిక్కుల్లో పడుతుందని ఆలోచించి ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. కాగా 2015 లో సినిమాలకు దూరమైన అబ్బాస్ మళ్లీ అవకాశాలు వస్తే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆ ఇంటర్య్వూలో తెలిపారు. అబ్బాస్ కు త్వరలో సినిమా అవకాశాలు వచ్చి అలరించాలని మనం కూడా కోరుకుందాం.