చలికాలంలో శరీర బరువు పెరుగుతుందా? పొట్ట ముందుకు వచ్చేసిందని తెగ బాధపడిపోతున్నారా? మీ సమస్యను ఇంట్లో వాళ్లకి, స్నేహితులకు చెబితే.. వారూ ఇదే విధంగా స్పందిస్తున్నారా..? ఇది మీ ఒక్కరి సమస్యే కాదూ, అనేక మంది ఎదుర్కొంటున్నదే. దానికి వాతావరణ పరిస్థితులని సరిపెట్టేసుకున్నా, శరీరంలో జరుగుతున్న మార్పులకు చూసి దిగులు చెందుతున్నాం. అలా అని నోరు కట్టేయగలమా, అంటే అదీ అసాధ్యం. నచ్చిన ఆహారాన్నికొలతలు వేసుకుని తినలేం. కానీ ఈ డిటాక్స్ డ్రింక్స్ తాగి టైర్ల లాంటి పొట్టను, ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఉదయాన్నే ఈ డిటాక్స్ డ్రింక్స్ సేవించడం వల్ల శరీరంలోని మలినాలు, పేరుకు వ్యర్థాలు తొలగిపోతాయి. దీంతో శరీర బరువు క్రమ క్రమంగా తగ్గుతుంది. బరువు తగ్గడమే కాకుండా.. శరీరాన్ని మృదువుగా ఉంచేందుకు కూడా ఈ డ్రింక్స్ సాయపడతాయి. ఈ డిటాక్స్ డ్రింక్స్ కోసం ఆన్ లైన్ లో షాపింగ్ చేయనక్కర్లేదు. సూపర్ మార్కెట్ కు పరిగెత్తాలన్నాహైరానా పడనక్కర్లేదు. కేవలం ఇంట్లో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో చేసుకోవచ్చు.
అల్లం, పుదీనాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసు. ముఖ్యంగా చలికాలంలో వీటిని వినియోగించడం వల్ల జలుబు, శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటినీ వినియోగించి, మనం బరువు, పొట్టను తగ్గించుకోవచ్చు. చిన్న అల్లం ముక్క, కొన్ని పుదీనా ఆకులు ఓ గ్గాసు నీళ్లల్లో రాత్రంతా ఉంచి.. పరగడుపున వీటిని తాగండి. ఇది ఓ రీప్రెషనర్ డ్రింక్ లా కూడా పనిచేస్తుంది.
ప్రతి రోజూ బరువును తగ్గించుకునేందుకు గ్రీన్ టీ తాగుతూనే ఉన్నారా.. అయితే గ్రీన్ టీ తో నిమ్మ రసాన్ని జోడించండి. గ్రీన్ టీ బరువును తగ్గిస్తే, నిమ్మ అదనపు కొవ్వును కరిగించేస్తుంది.
జీరా నీటి తాగడం వల్ల..గ్యాసే కాదూ, ఊబకాయం కూడా త్వరగా తగ్గుతుంది. ఇదెంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు . రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్రను తీసుకుని, ఓ గ్లాస్ వాటర్ లో వేయండి. రాత్రంతా నీళ్లల్లో నాననిచ్చి.. తెల్లవారు జామున ఆ నీటిని వడకట్టి, నిమ్మరసాన్నిజోడించి తాగి చూడండి. మీలో మార్పు మీకే తెలుస్తుంది.
అధిక బరువును తగ్గించుకోవాలంటే ఇది బెస్ట్ డిటాక్స్ డ్రింక్ అని సూచించారు ప్రముఖ న్యూట్రిషియన్ అంబికా దండోనా. నానబెట్టిన మెంతుల నీరు తాగడం వల్ల ఊబకాయంతో పాటు షుగర్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. ఇవన్నీ అందుబాటులో ఉండేవే కదా. మరెందుకు ఆలస్యం. ఇందులో మీకు నచ్చినదీ ట్రై చేయండి. ఈ డిటాక్స్ డ్రింక్స్ పై మీ అభిప్రాయాలు తెలియచేయండి.