నేటి సమాజంలో అనేక అంతు చిక్కని వ్యాధులతో మానవాళి అల్లాడుతుంది. కాల క్రమంతో పాటు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అలానే అనువంశిక వ్యాధులు కూడా మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యల నివారణ కోసం శాస్త్రనిపుణులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. అలానే వ్యాధులకు చికిత్సా విధానాలను రూపొందిస్తుంటారు. అయితే ఈ ఔషధాలు ప్రయోగశాలను దాటి ఆసుపత్రుల్లో అడుగు పెట్టేందుకు దశాబ్ధాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా మనిషిని ఊరిస్తోన్న అలాంటి వైద్య విధానాల్లో కొన్ని ఈ ఏడాదిలో అందుబాటులోకి రానున్నాయి. అలాంటి వాటిల్లో అల్జీమర్స్ నివారించేందుకు సంబంధించిన వైద్య విధానం ఒకటి. మరి.. అల్జీమర్స్ సమస్యను నివారించేందుకు శాస్త్రవేత్తలు తీసుకొచ్చిన ఆ వైద్యవిధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్లీ అది గుర్తుకురావడం జరుగుతుంది. కారులో పెట్టిన సెల్ ఫోన్, ర్యాక్‌లో ఉంచిన బండి తాళాలు, తలపై పెట్టిన కళ్ల అద్దాల గురించి ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటాం. కానీ, ఒక రోజు ఏకంగా మీ ఇంటి అడ్రస్ మర్చిపోతే, మీ ఇంట్లో వాళ్ల పేర్లు, ముఖాలు మర్చిపోయి గజినీలా తయారైతే.. ఈ ఊహే ఎంతో భయంకరంగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి సోకిన వారి పరిస్థితి అచ్చం అలాగే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని అల్జీమర్స్ సమస్య ఇబ్బంది పెడుతుంది. అందులోనూ మరీ.. ముఖ్యంగా వృద్ధుల్ని ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.
ఈ అల్జీమర్స్ మతిమరపు అడ్డుకోవడం వైద్య నిపుణులకు అసాధ్యంగా మారింది. ఇలాంటి తరుణంలో మతిమరుపు నివారణకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి.. చిప్ ను పోలిన ఇంప్లాంట్స్ ను రూపొందించారు. ఇవి అచ్చంగా మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ లోని ఎలక్ర్టోకెమికల్ సంకేతాల్లానే పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచి.. మతిమరుపు రాకుండా చేస్తాయి. ఇప్పటికే దీనిని ఎలుకలు, కోతులపై ప్రయోగం చేయగా విజయవంతం అయింది. అలానే కొందరు మనషులపై కూడా చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇప్పుడు రోగుల్లో వాడేందు శాస్త్ర వేత్తలు సిద్ధమయ్యారు. జ్ఞాపకాల్ని పదిలపరిచే ఆరోగ్యకరమైన మెదడు కణజాలంలోకి ఎలక్ట్రోడ్ శ్రేణులను పంపిస్తారు. అనంతరం వాటిని ప్రేరేపించడం ద్వారా వాటికి నమూనాలు ఏర్పడేలా చేస్తారు. ఈ రకమైన న్యూరల్ ప్రాసెసిస్ తో అల్జీమర్స్ రోగుల్లో మతిమరుపుని నివారించ వచ్చన్నమాట.
అంతేకాక బయోజెన్, ఈజై సంస్థలు మోనోక్లోనల్ ప్రతినిరోధక శక్తులతో రూపొందించిన లెకానేమాబ్ అనే మందు ద్వారా మతిమరుపును అడ్డుకోవచ్చు. లెకానేమాబ్.. మెదడులో పేరుకునే బీటా ప్రోటీన్ ను తొలగించడం ద్వారా మతిమరుపుని అడ్డుకుంటుందట. అనావెక్స్ లైఫ్ సైన్స్ కంపెనీ రూపొందించిన బ్లార్కామెసీన్ అనే మందు కూడా లెకానేమాబ్ లాంటిదే. ఈ రెండు ఔషధాలు పూర్తి స్థాయిలో మార్కెట్ లోకి వస్తే.. అల్జీమర్స్ కి పూర్తి స్థాయి చికిత్స అందినట్లే. మరి.. మతిమరుపు సమస్యను నివారించేందుకు వైద్యరంగంలో వస్తున్న ఈ కొత్త వైద్య చికిత్స విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.