సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం అనేది సర్వసాధారణం. అయితే కొన్ని కొన్ని గ్రహణాలు అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని ఏళ్లకు ఒక్కసారి అలాంటి గ్రహణాలు ఏర్పడుతుంటాయి. అలాంటి గ్రహణాలు.. ఈ సారి నెల వ్యవధిలోనే రెండు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 26న అరుదైన సూర్య గ్రహణం ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే. అలానే నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. నవంబరు 8, మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుంది. భారత్ లోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది. అయితే ఆకాశంలో ఏర్పడే గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న ప్రాణుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చాలా మంది నమ్ముతారు. నమ్మకం అంటూ ఉంచితే.. సైన్స్ పరంగా గ్రహణాల నుంచి వెలువడే కిరణాలు ప్రభావం చూపిస్తాయని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలా మంది భావిస్తారు. మరి.. గ్రహణం సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నవంబరు 8న రానున్న చంద్రగ్రహణం భారత్ తో పాటు నేపాల్, జపాన్ ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది. ఈ గ్రహణం ప్రారంభమైన దాదాపు గంట సమయం తర్వాత చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ గ్రహణం ప్రభావం పూర్తిగా కనపడుతుంది. ఇలా 5:11 గంటల వరకూ సాగుతుంది. ఇక అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి కక్ష్య నుంచి భూమి తప్పుకోవడం మొదలై సాయంత్రం 6:27 గ్రహణం ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ గ్రహణం గర్భిణీలపై ప్రభావం చూపుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ గ్రహణం సమయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
ఈ గ్రహణం సమయంలో గర్భిణీ నేరుగా గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో విడుదల అయ్యే కిరణాలు.. గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆ సమయంలో బయటకు రాకుండా..ఇంట్లోనే ఉండాలి. గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ ఈ సమయంలో ఆహారం తీసుకోవలసి వస్తే.. కొన్ని తులసి ఆకులును వేసుకుని ఉడికించిన లేదా గోరు వెచ్చని నీటిని తాగాలి. ఈ గ్రహణం మొదలైనప్పటి నుంచి గర్భిణీ స్త్రీ స్నానం చేయకూడదు. గ్రహణ సమయంలో వాకింగ్, వ్యాయామం లాంటివి చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందు ముగిసిన అనంతరం తప్పకుండా స్నానం చేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి నమ్మకాలకు సరైన ఆధారాలు లేవని కొందరు అంటుంటారు.
అయినప్పటికీ గ్రహణం సమయంలో మహిళలు ఇప్పటికీ ఈ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు. అయితే గ్రహణం సమయంలో అంతా భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండి మనసును తేలికగా ఉంచుకోవాలి. సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడమో చేయాలి. కేవలం కొందరు నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ జాగ్రత్తలు తెలపడం జరిగింది. ఈ విషయాలను మీరు పరిగణనలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోగలరు.