హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా వరుస పండుగలతో పల్లెటూర్లు సందడి చేస్తుంటాయి. భోగి రోజున తెల్లవారుజామునే లేచి కట్టెలు, ఎండిన చెట్ల కొమ్మలు అవీ తెచ్చి భోగి మంట వేస్తారు. ఆ మంటల్లో వేడి నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తారు. అయితే భోగి మంటలు వేసేది.. కేవలం చలిని తట్టుకోవడం కోసమేనా? అంటే కాదు. భోగి మంటలు వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శాస్త్రీయ కారణాలు తెలుసుకునే ముందు భోగి పండుగ ఎలా వచ్చింది? భోగి మంటల పేరుతో మనుషులు చేసే తప్పులు ఏమిటి? వంటి విషయాలు తెలుసుకుందాం. ఆ తర్వాత భోగి మంటల వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటో అనేది తెలుసుకుందాం.
భోగి అనే పదం భుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. తెలుగులో భోగం అంటారు. భోగం అంటే సుఖం. శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిన రోజు ఈరోజే అని.. అందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన విషయం మనకి తెలిసిందే. అయితే బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున బలి చక్రవర్తిని భూలోకానికి వచ్చి ప్రజలని ఆశీర్వదించమని వరం ఇచ్చారని పురాణ గత. అందుకే బలి చక్రవర్తిని ఆహ్వానించేందుకు భోగి మంటలు వేస్తారని చెప్పబడింది.
ఇవన్నీ కథలండి. మేమూ చెప్తాము. మాకు కథలు కాదు. శాస్త్రీయత కావాలి. దేవుడి ఉనికిని కనిపెట్టలేని సైన్స్ మాకు కావాలి అని వాదించే వారి కోసం కాకపోయినా.. హిందువులుగా తెలుసుకోవాల్సిన బాధ్యత హిందువులది కాబట్టి శాస్త్రీయ కారణాలు తెలుసుకోవాలి. సాధారణంగా భోగి మంటలు ఎందుకు వేస్తున్నావ్ అంటే.. బాగా చలిగా ఉంది కదా. అందుకు అని అంటారు. కానీ చలి కోసమే అయితే ఇంట్లోనే దుప్పటి కప్పుకుని ముసుగు వేసుకుని ఉండచ్చుగా. ఏడాదిలో ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు మంచు కమ్ముతుందో తెలియని రోజుల్లోనే విపరీతమైన చలిని భరించినప్పుడు ఒక్క భోగి రోజున చలిని భరించలేని మనుషులు ఉన్నారంటే ఆశ్చర్యమే. చలి కోసం కాదని తెలిసినా, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు చెప్పలేక అలా చెప్తారు. అయితే భోగి మంటలు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
భోగి మంటల వల్ల వెచ్చదనం వస్తుందన్న మాట నిజమే కానీ దాని కంటే ముందు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి ఇంటి ముందు ముగ్గులో పెడతారు. ఈ గొబ్బెమ్మలను పిడకలుగా చేసి.. భోగి మంటల్లో వేసి కాలుస్తారు. ఈ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. భోగి మంటలు పెద్దగా రావడం కోసం మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన చెట్ల బెరడులు వేస్తారు. రావి, మామిడి, మేడి చెట్లు అంటే ఔషధ చెట్లని మనకి తెలిసిందే. ఈ చెట్ల బెరడుని వేసి.. ఆవు నెయ్యి వేసి కాలుస్తారు. దీని వల్ల ఆక్సిజన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా.. శ్వాసకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేస్తుంది.
ఆవు నెయ్యి, పిడకలు, రావి, మామిడి, మేడి చెట్టు బెరడులను కలిపి కాల్చడం వలన వచ్చే పొగ గాలిలో కలిసి శక్తివంతంగా మారుతుంది. ఆ గాలి పీల్చడం వలన శరీరంలో 72 వేల నాడుల్లోకి ప్రవేశించి.. శరీరం శుభ్రమవుతుంది. రోగాల నుంచి శరీరాన్ని ఎవరికి వారు రక్షించుకోవాలనే సదుద్దేశంతోనే ఈ భోగి మంటల ప్రక్రియని ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చారు. ఆరోగ్యానికే కాదు ఐకమత్యానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం వల్ల సామాజిక దూరం తగ్గుతుంది. మామూలుగా హోమాలు అవీ చేస్తుంటారు. అగ్ని దేవుడికి పూజలు చేస్తారు. ఎందుకంటే అగ్ని దేవుడు లేనిదే పనులు జరగవని పండితులు చెబుతారు.
బియ్యపు గింజ తినే మెతుకుగా మారాలంటే నిప్పు కావాలిగా. పంచభూతాలని, ప్రకృతిని ఆరాధించడం హిందువుల జీవన విధానంలో ఒక భాగం. ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞతలు చెప్పడం సంస్కారం. అందుకే అగ్ని దేవుడికి కృతజ్ఞతగా హోమాలు చేస్తారు. భోగి పండుగ నాడు వేసే భోగి మంటలు కూడా అగ్ని దేవుడికి కృతజ్ఞతగా చేసేదే. అగ్నిదేవుడికి కృతజ్ఞత చెప్పినట్టు ఉంటుంది. మరోవైపు ఆరోగ్యానికి మంచిది. కానీ దురదృష్టవశాత్తు మనం పాత వస్తువులను తెచ్చి భోగి మంటల్లో వేస్తున్నాం. కొంతమంది రబ్బర్ టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంట్లో పాత వస్తువులు ఉంటే అవి వేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంటారు. దీని వల్ల ఆరోగ్యం రాకపోగా.. కాలుష్యం విడుదల అవుతుంది. అది పీల్చి అనారోగ్యం పాలవుతున్నాం. సంక్రాంతి అంటే కొత్తదనం.. కొత్త ఆశలు చిగురించే పర్వదినం. సిరులు తెచ్చిపెట్టే పర్వదినం. అలాంటి పర్వదినాన ఎవరైనా పాత వస్తువులు వేస్తారా? శుభమా అని భోగి మంటలు వేసుకుని.. అందులో పనికిరాని వస్తువులు, పాత వస్తువులు వేయడం భావ్యమేనా?
అసలు పాత వస్తువులు తీసుకొచ్చి భోగి మంటల్లో వేయాలన్న సంస్కృతి లేనే లేదు. మరి ఈ సంస్కృతి ఎలా వచ్చింది? ఎవరు అలవాటు చేశారు? అంటే బ్రిటిష్ వాళ్ళ పనే అని చెబుతారు. మన దేశ సంపదను దోచుకుని మన ఋషులు అందించిన జ్ఞాన సంపదను సర్వ నాశనం చేశారు. భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఋషులు అందించిన గ్రంథాలను తగలేస్తే గానీ సాధ్యం కాదని.. గ్రంథాలను భోగి మంటల్లో తగలబెట్టారు. అలా పాత వస్తువులను భోగి మంటల్లో వేయాలన్న మూఢ నమ్మకాన్ని వ్యాప్తి చేశారని చెబుతారు. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. కానీ ప్రజలు మాత్రం భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం ఒక సాంప్రదాయంగా చేసుకున్నారు.
నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది.. పాత వస్తువులని కాదు. దుర్గుణాలు, చెడ్డ అలవాట్లతో పాడుబడిపోయిన ఈ పాత మనిషిని. ఈ పాత మనిషి యొక్క పాడు ఆలోచనలను భోగి మంటల్లో వేసి కలిస్తే.. మనిషికి మానసిక ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. అదండి మరి విషయం. మన పూర్వీకులు ఏం చెప్పినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. దేవుడిని ముడి పెట్టి ఇదే ఆచారం, ఆచరించు అని చెప్పేది అందులో ఉన్న శాస్త్రం గురించే. ఆ శాస్త్రం వల్ల ప్రజలకు మేలు జరగాలనే. ఇవాళ యూట్యూబ్ లో గొంతు చించుకుని డాక్టర్లు.. అవి తినండి, ఇవి తినండి. వ్యాయామాలు చేయండి అని చెబుతుంటే ఎవరైనా వింటున్నారా?
అదే దేవుడి పేరు చెబితే జనానికి భయం. చెప్తే మాటలు వినడం లేదనే దేవుడి పేరు పెట్టి ఇలా పండుగలు, సాంప్రదాయాలు తీసుకొచ్చారు కాబోలు. ఏది ఏమైనా గానీ పండగల వల్ల ప్రజలకి మేలే గానీ నష్టమైతే లేదుగా. భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు. అడ్డమైన కంపులు పీల్చే కంటే భోగి మంటల నుంచి వచ్చే సువాసనలను పీల్చడం మంచిదే. దీని వల్ల అనారోగ్యం అయితే రాదు. మరి మీరు భోగి మంటల్లో ఏమేమి వేస్తారు? భోగి మంటల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మీకు తెలిసిన వాస్తవాలు ఏమిటో? కామెంట్ చేయండి.