అలానే 1170, 1173, 1317 సామాన్య శకం నాటి శాసనాలను కూడా గుర్తించారు. ఏది ఏమైనా గానీ దేశంలోనే తొలి అర్ధనారీశ్వర శివ లింగం మహా శివరాత్రి సమయంలో ఉందని తెలుసుకోవడం అనేది శివ భక్తులకు మంచి వార్త అని చెప్పవచ్చు.
శివ భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహా శివరాత్రి పర్వదినానికి ఇంకొక్క రోజే ఉంది. కొన్ని రోజుల ముందు నుంచే భక్తులు శివరాత్రి కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఎలాంటి పూజలు చేయాలి.. ఎలా ఉపవాసం ఉండాలి వంటి విషయాల గురించి ఓ లిస్ట్ తయారు చేసి పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా దేవాలయాల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశంలోని ఒక్కో శివాలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఆలయ విశిష్టతను బట్టి భక్తులు దర్శనానికి వెళుతుంటారు. అలాంటి భక్తుల కోసం శివరాత్రి ముందు ఓ తీపి కబురు అందింది. గుంటూరులో ఓ అరుదైన శివలింగం బయటపడింది.
అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యేకమైన శివలింగం ఒకటి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో దర్శనమిచ్చింది. ఈ శివలింగం దేశంలోనే తొలి అర్ధనారీశ్వర లింగం అని, 4వ శతాబ్దంలో ప్రతిష్టించబడిందని పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ శివనాగిరెడ్డి వెల్లడించారు. ఆలయ అర్చకుడు పీవీపీ శాస్త్రి ఇచ్చిన సమాచారం మేరకు.. పురావస్తు పరిశోధకుడు, చరిత్రకారుడు అయిన శివనాగిరెడ్డి ఆనందేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్ని 4వ శతాబ్దంలో ఆనందగోత్రీలు నిర్మించినట్లు ఆయన కనుగొన్నారు. గుంటూరు జిల్లా చేజర్ల, కంతేరు ప్రాంతాల నుంచి ప్రజలను పాలించిన ఆనందగోత్రీ రాజ వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించి.. అర్ధనారీశ్వర శివ లింగాన్ని ప్రతిష్టించినట్లు చెప్పుకొచ్చారు.
ఆనందగోత్రి పేరు మీదుగానే ఈ ఆలయానికి ఆనందేశ్వర ఆలయం అన్న పేరు వచ్చినట్టు తెలుస్తోంది. ఆలయంలో ఉన్న లింగాన్ని చూస్తే.. ముందు భాగంలో సగభాగం శివుడు, సగభాగం పార్వతి దేవిల ప్రతిరూపాలు కనబడుతున్నాయి. 1600 ఏళ్ళ క్రితమే అప్పటి రాజులు అర్ధనారీశ్వర ప్రతిరూపాలు చెక్కారని, దేశంలోనే తొలి అర్ధనారీశ్వర లింగం ఇదే అని శివ నాగిరెడ్డి అన్నారు. మొదటి అర్ధనారీశ్వర శిల్పం మొదటి శతాబ్దంలో కుషన రాజుల కాలంలో ఉందని, అది ప్రస్తుతం మధుర మ్యూజియంలో ఉందని.. అయితే అది శివలింగం మీద లేదని అన్నారు. శివలింగం మీద అర్ధనారీశ్వర ప్రతిరూపాలు చెక్కబడటం అనేది గుంటూరు జిల్లా పెదకొండూరులో ఉన్న ఆలయంలో మాత్రమే ఉందని అన్నారు. మరి, ఈ అరుదైన శివలింగంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.