చాలా మంది తమ చేతి వేళ్ళకి బంగారు ఉంగరాలు, వెండి ఉంగరాలు ధరిస్తుంటారు. ఎక్కువ మంది బంగారంతో చేసిన దేవుని ఉంగరాలు ధరిస్తుంటారు. ప్రతీ ఒక్కరికీ ఇష్టదైవం ఉంటుంది. ఆ ఇష్టదైవం రూపు కలిగిన ఉంగరాన్ని తమ కుడి చేతి వేలికి ధరిస్తారు. ఎక్కువ శాతం మంది వెంకన్నబాబు, లక్ష్మీదేవి, గణపతి దేవుళ్ళ ఉంగరాలు ధరిస్తారు. కొంతమంది రంగు రాళ్ళ ఉంగరాలు తొడుక్కుంటూ ఉంటారు. అయితే దేవుని ఉంగరాలు పెట్టుకోవచ్చా? అన్నం తినేటప్పుడు ఎంగిలి మెతుకులు దేవుని బొమ్మకు అంటుకుంటాయి కదా. అది అపచారమే అవుతుంది కదా అనే భావన ఉంటుంది. అంతేకాదు ఎల్లప్పుడూ ఉంగరాన్ని ధరించే ఉంటాము. ఈ చేతితో ఎన్నో పనులు చేస్తాము కదా. ఆ చేతికి తగిలిన వస్తువులు దేవుడి ప్రతిమకు తగులుతాయి. మరి ఇది అపచారమా? అనే సందేహం ఉంటుంది.
పలానా రాశి వారు పలానా రాయి ఉంగరం ధరిస్తే మంచిదని జ్యోతిష్యులు చెప్పేవరకూ.. ఏ రాయి పడితే ఆ రాయి ధరించకూడదని పెద్దలు చెబుతారు. ఇయన్నీ కాదని దేవుని బొమ్మ కలిగిన ఉంగరాన్ని పెట్టుకుంటే ఏ బాధలూ ఉండవని చాలా మంది దేవుడి ఉంగరాల వైపు మొగ్గు చూపుతారు. బంగారంతోనో, వెండితోనో చేసిన దేవుని ఉంగరాన్ని ధరించి మురిసిపోతుంటారు. అలా ఉంగరం పెట్టుకుంటే తమకి తోడుగా భగవంతుడు ఉంటాడని, భగవంతుని కృప తమపై ఉంటుందని నమ్ముతారు. అయితే దేవుని ఉంగరం ఎందుకు ధరిస్తున్నారో అని ఆలోచించారా? ఉంగరంపై దేవుడు ఉన్నాడనే కదా మీరు ఉంగరం ధరించారు. మరి ఉంగరంలో దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు.. దేవుడికి ఎంగిలి మెతుకులు పెట్టడం భావ్యమేనా? దేవుడికి పూజ చేసినప్పుడు నైవేద్యం పెడతాం కదా.
ఆ నైవేద్యం ఎంగిలి చేసి పెడతారా? లేదు కదా. మరి కుడి చేతితో అన్నం తింటున్న మనం.. ఆ వేలికి ఉన్న ఉంగరం మీద దేవుడికి ఎంగిలి మెతుకులు లేదా ఎంగిలి ఆహారం తగిలించడం భావ్యమేనా? భగవంతుడికి ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు అని ఆలోచించేవారు దయచేసి అన్నం తినే ముందు దేవుని ఉంగరం తీసేయండి. భోజనం చేసిన తర్వాత పెట్టుకోండి. అలా కాకుండా భగవంతుడికి ఇది నేను ఇచ్చే నివేదన, ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అనే భావన ఉంటే వేలికి దేవుని ఉంగరం ఉంచుకునే భోజనం తినచ్చు. ఈ సమస్త సృష్టిలో పదార్థాలన్నీ దేవుడి సృష్టి నుంచి వచ్చినవే. ఆయనకి ఎంగిలి ఏమిటి అనుకునేవారు.. నిర్మొహమాటంగా ఉంగరం ఉంచుకుని భుజించవచ్చు.
ఎంగిలి అనేది మనకి గానీ దేవునికి ఉండదు అనుకునేవారు ఉంటారు. దేవునికి ఎంగిలిపెట్టకూడదు అనుకునేవారూ ఉంటారు. ఎవరి భావన వారిది. భావనలో భావం భావ్యంగా ఉంటే దేవుని ఉంగరం ధరించినా తప్పు లేదు. అయితే మీ భావానికి తగ్గట్టు మీరు ప్రవర్తిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. గుర్తుంది కదా, తినేటప్పుడు ఎంగిలి ఆహారం పెడుతున్నామన్న భావన ఉంటే ఉంగరం కాసేపు తీసి పక్కన పెట్టండి. లేదు భగవంతుడు ఇచ్చిందే ఇదంతా అనుకుంటే గనుక.. ఉంగరం ఉంచుకుని ‘మనసులో ఇది నీవిచ్చిందే స్వామి.. మహా ప్రసాదం’ అనుకుని తినవచ్చు.