హైందవ సంప్రదాయంలో ప్రతి రోజూ విశేషమైనదే. అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఆ రోజు చేసిన పాప పుణ్యాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అంటారు. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియనాడు వచ్చే అక్షయ తృతీయకు హైందవ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. ఈ పర్వదినం రోజున చేసే జప, తప, దాన, యజ్ఞ యాగాదాలు ఆ రోజు అక్షయ ఫలితాన్నిస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాలనిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఇతర తిథుల్లా ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ వర్తించవు. క్షణంలోనైనా శుభకార్యాలను ఆచరించొచ్చని పురాణ వచనం. త్రేతాయుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే. పరశురాముడు జన్మించిందీ ఆ రోజే.
ఇక మన సమాజంలో గత కొంత కాలంగా.. అక్షయ తృతియ నాడు బంగారం కొనే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఆ రోజు బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు కొంటే.. వృద్ధి చెందుతాయని చాలా మంది నమ్మి అప్పో సొప్పో చేసి మరీ కొంటుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అంటున్నారు పండితులు. ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారామనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటని శాస్త్రం చెబుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయడం ఉత్తమమని పండితులు చెబుతుంటారు. అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి. కనుక అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులేంటో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి..
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు.sumantv.com దానిని నిర్ధారించలేదు.