ఒంటరిగా ఉన్నారా? మీతో మాట్లాడేందుకు ఎవరు లేరా? మీకు స్నేహితుడు/స్నేహితురాలు కావాలా? అంటూ వచ్చే మొబైల్ సందేశాలు ఇప్పుడు ఎందరో కుర్రాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. కాసేపు మాట్లాడితేపోలా అని సరదాగా స్పందిస్తే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే అంటున్నారు బాధిత కుర్రాళ్ళు. తమకు జరిగిన మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేక, లోలోపలే కుమిలిపోతున్నారు. కాలక్షేపం అవుతుంది అనుకుంటే కాలం మారిపోయిందిగా అంటూ కుంగిపోతున్నారు.
జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి(24) విశాఖ యువకుడి నుంచి 24 లక్షలు వసూలు చేసిన విషయాన్నీ ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకొచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో జ్యోతి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. కుత్భుల్లాపూర్లో ఓ కాల్ సెంటర్లో సుమారు 25 మంది అమ్మాయిలు పనిచేశారు. కాల్ సెంటర్ మూతపడటంతో అక్కడ పనిచేసే కృష్ణా జిల్లాకు చెందిన టీం లీడర్ అబ్దుల్ రహమాన్ ఆ అమ్మాయిలను చేరదీసాడు. వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీళ్ళే కాకుండా ఇంకా ఇలాంటి కి’లేడీ’లు ఎంతో మంది ఉన్నట్లు సైబరాబాద్, రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సర్వీస్ ప్రొవైడర్లు, మార్కెటింగ్ కంపెనీల నుంచి సందేశాలు పంపుతున్నారు. అక్కడున్న నంబరుకు కాల్ చేయగానే ఆట మొదలెడతారు. వర్చువల్ నంబర్ల నుంచి కాల్ చేసి ఒక పదిరోజులు ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ నంబరు అడగగానే అసలు ఆట మొదలవుతుంది. ఫేక్ ఐడీలతో తీసుకున్న నంబర్ల నుంచి వాట్సప్ సందేశాలు పంపుతారు. వీడియో కాల్ చేసి ఒక్కోపనికి ఒక రేటు చెప్పి రెచ్చగొడతారు. అవతలి వ్యక్తిని ముగ్గులోకి దింపి స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడియోలు పంపుతారు. అడిగిన సొమ్ము ఇవ్వలేదంటే వీడియోలు నెట్లో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.