యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో దారుణం చోటు చేసుకుంది. అప్పులు, ఈఎంఐలు చెల్లంచలేక ఓ యువకుడు అమ్మమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న వెండి, బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్పాన్‌పేట్ గ్రామానికి చెందిన యాదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఈ నెల 27వ తేదీన తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపెట్టింది. వృద్ధురాలి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె మేనల్లుడు దర్శన్ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మృతదేహంపై గాయాలు ఉన్నట్లు తేలడంతో, ఇది సహజ మరణం కాదని.. ఎవరో కావాలనే ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేశారని డాక్టర్లు నిర్ధారించారు.
“హత్య కేసుగా నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో యాదమ్మ బంధువైన మంటిపల్లి రాజు అనే యువకుడి కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు ప్లాన్ బయటపడింది. ఆభరణాలు, డబ్బు కోసమే తాను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితుడు రాజు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

“నిందితుడు రాజు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. అతను గత కొంతకాలంగా విపరీతమైన అప్పులు, నెలవారీ ఈఎంఐ వాయిదాలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఎలాగైనా త్వరగా డబ్బు సంపాదించాలని ఒంటరిగా ఉంటున్న బంధువు యాదమ్మను టార్గెట్ చేసుకున్నాడు. ఈ నెల 27న ఆమె ఇంట్లోకి ప్రవేశించి, యాదమ్మను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని వద్ద నుంచి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జైలుకు తరలించారు.
