మోసగాళ్లు తెలివిమీరుతున్నారో.. లేక జనాల్లో అత్యాశ పెరిగిపోవడం వల్ల మోసాలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. కరక్కాయల పొడి మొదలు.. వత్తుల మిషన్ ఇలా సామాన్యులను టార్గెట్‌గా చేసుకుని.. కోట్లలో మోసం చేసిన వార్తలు నిత్యం చదువుతూనే ఉన్నాం. ఇక వీటిని మించిన ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. సాధారణంగా పండుగ వేళ చాలా ఖర్చు ఉంటుంది. కొత్త బట్టలు లాంటివి కొనకపోయినా సరే.. పండుగ వేళ పిల్లల కోసం కొన్ని చిరుతిళ్లు చేయాలన్నా.. సరే బాగానే ఖర్చవుతుంది. వంట నూనే, పప్పులు వంటి వాటి ధరలు ఎంతలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువలో తక్కువ ఎంత లేదన్నా.. 4-5 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే చాలా మంది దగ్గర.. ఆ మొత్తం ఉండదు. ఇదుగో దీన్ని ఆసారాగా చేసుకుని.. ఓమహిళ ఘరానా మోసానికి దిగింది. ఏకంగా 4 కోట్ల రూపాయలు మోసం చేసింది. ఆ వివరాలు..
ఈ ఘరానా మోసం.. ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ అయిన మహిళ ఒకరు.. పండగ సరుకుల పేరు చెప్పి.. దాదాపు రూ.4కోట్లు కొట్టేసింది. గుర్ల మండలం ఎస్ఎస్ఆర్పేటకు చెందిన శ్రీలేఖ.. నెలిమర్ల మండలం కొండగుంపాం గ్రామ సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయంతో.. ఓ స్కీమ్ ప్రారంభించింది. అది ఏంటంటే.. క్రిస్టమస్, సంక్రాతి సందర్భంగా.. సరుకులు ఇస్తానని.. ఇందుకు గాను.. నెలకు 300 వందల రూపాయలు కడితే చాలు అని చెప్పింది. దాంతో ఇదేదో తమకు పనికి వచ్చేలా ఉందని భావించి.. చాలా మంది పేద, మధ్యతరగతి మహిళలు ఈ స్కీమ్‌లో చేరారు.
ఏఆర్ బెనిఫిట్ ఫుడ్ పేరుతో స్కీమ్‌ను ప్రారంభించింది శ్రీలేఖ. తమకు జనవరి నుంచి డిసెంబర్ వరకు.. నెలకు రూ.300 చొప్పున సంవత్సరానికి రూ.3,600 కడితే.. క్రిస్టమస్, సంక్రాతి పండుగ నేపథ్యంలో.. 24 రకాల నిత్యావసర సరకులు డిసెంబరు 10 తర్వాత ఇస్తానని అందరికీ చెప్పి నమ్మించింది. అయితే శ్రీలేఖ.. గతేడాది కూడా ఇలాగే డబ్బులు వసూలు చేసి సరుకులు ఇవ్వడంతో.. నిజమని నమ్మి చాలా మంది.. ఈ ఏడాది కూడా స్కీమ్‌లో చేరారు. నెల్లిమర్ల, విజయనగరం, గుర్ల, పూసపాటిరేగ, భోగాపురం, బొండపల్లి, గజపతినగరం తదితర మండలాల పరిధిలో ఏకంగా 10వేల మంది వరకు ఈ స్కీమ్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు రూ.4 కోట్లు వసూలు చేశారు.
శ్రీలేఖ పప్పల చీటీలో సభ్యులను చేర్పించడానికి ఏజెంట్లను కూడా నియమించింది. తాము చేరి.. మరొకరిని చేర్పిస్తే.. ఒకరికి రూ.100 కమీషన్ ఇస్తామనడంతో.. మరికొందరు వాలంటీర్లు కూడా ఏజెంట్లుగా చేరినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా చాలామంది ఈ చీటీలు కట్టారు. ఇక శ్రీలేఖ తనతో పాటు కొండకరకాంకు చెందిన ఆమె మేనమామ కుమారుడు అప్పలరాజును కూడా ఈ వ్యాపారంలో చేర్చుకుంది. ఇద్దరు కలిసి.. చాలా మంది పేద, మధ్యతరగతి మహిళల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు.
ఈ క్రమంలో కొంతమంది మహిళలు.. క్రిస్మస్ పండుగ ఉందని.. తమకు పండగ సామాగ్రి ఇవ్వాలని అడిగారు. ఇక అప్పటి నుంచి శ్రీలేఖ తన డ్రామా మొదలు పెట్టింది. రేపు, మాపు అంటూ తప్పించుకుని తిరగసాగింది. పండుగ దాటినా సరుకులు ఇవ్వకపోవడంతో.. గట్టిగా నిలదీయడం ప్రారంభించారు. దాంతో శ్రీలేఖ, ఆమె ఏజెంట్లు పరారయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మరి సమాజంలో పెరుగుతున్న ఈ తరహా మోసాలకు కారణం.. ఏంటని మీరు భావిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.