మెదక్ జిల్లాకు చెందిన ధర్మ నాయక్ మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో చనిపోయింది ధర్మ కాదని, వేరే వ్యక్తని పోలీసులు తేల్చారు. ధర్మ బతికే ఉన్నాడని గుర్తించారు. ధర్మ భార్య ఫోన్‌ను పోలీసులు ట్యాప్ చేయటంతో ఈ విషయం వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం అతడు పుణె నుంచి భార్యకు ఫోన్ చేసి తన డెత్ సర్టిఫికెట్ తీసుకోమన్నాడు. ధర్మ భార్య ఫోన్ ట్యాప్ చేసిన పోలీసులు అతడు పుణెలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. విచారణలో ధర్మ పలు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ వంటి పలు వ్యసనాల కారణంగా ధర్మ దాదాపు 2 కోట్ల రూపాయలు అప్పు చేశాడు.
అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో ఓ దారుణమైన ప్లాన్ వేశాడు. తన పేరిట ఉన్న 7 కోట్ల రూపాయల ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఓ నాటకం ఆడాడు. అచ్చం దుల్కర్ సల్మాన్ సినిమా ‘కురుప్’లోలా ఓ మర్డర్ ప్లాన్ వేశాడు. ఈ నెల 5న భార్యతో కలిసి సొంతూరుకు వచ్చాడు. తర్వాత మిత్రులతో కలిసి బాసర వెళుతున్నానని ఇంట్లో చెప్పి, కారులో బయటకు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో వెంకటాపూర్ శివారు ప్రాంతంలో తన కారు డ్రైవర్‌ను హత్య చేసి కారుతో పాటు కాల్చి దగ్ధం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు పక్కన దొరికిన పెట్రోల్ బాటిల్ కారణంగా పోలీసులకు అనుమానం వచ్చింది. హత్యా? లేక ప్రమాదమా? అన్న రెండు కోణాల్లో దర్యాప్తు చేశారు. అన్ని రకాలుగా కేసును విచారించటంతో అసలు విషయం బయట పడింది. కాగా, వెంకటాపూర్ పంచాయితీ పరిధిలోని భీమ్లా తండా గ్రామానికి చెందిన ధర్మ నాయక్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నీటిపారుదల శాఖలో సహాయ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. మరి, అప్పులు తీర్చడానికి హత్య చేసిన ధర్మ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.