ప్రస్తుతం ఎవరు? ఎందుకు? ఏం చేస్తున్నారు? అనే వాటిపై ఎవరూ సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సినిమాలు సమాజంపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో చెడు- మంచి రెండు విషయాలు ఉంటాయి. కానీ, చెడు ప్రభావం చూపినంత మేర మంచి సమాజంపై ప్రభావం చూపలేకపోతోంది. సినిమాలను చూసి క్రైమ్ లు చేయడం కూడా బాగా పెరిగిపోయింది. ఆ సినిమాలో హీరో అలా కొట్టాడు అంటూ రియల్ లైఫ్‌లో వీళ్లు కొట్లాటలకు వెళ్లడం, మరో సినిమాలో హీరో గ్యాగ్‌స్టర్ అని వీళ్లు కూడా హత్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన గురించి తెలుసుకుంటే.. ఒళ్లు గగుర్పొడవక మానదు.
వివరాల్లోకి వెళ్తే.. క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్న వారు చాలా మందే ఉన్నారు. అలా ఓ 17 ఏళ్ల కుర్రాడు సొంత కుటుంబాన్నే అతి కిరాతకంగా హత్య చేశాడు. తల్లి, సోదరి సహా మొత్తం నలుగురు కుటుంబసభ్యులను గొడ్డలితో నరికి చంపాడు. త్రిపురలోని ధలాయ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి నిందితుడి కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రపోతున్నారు. గాఢంగా నిద్రపోతున్న తల్లి, తాత, అత్త, సోదరిలను ఆ కుర్రాడు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఆ సమయంలో వారి కేకలు బయటకు వినిపించకుండా ఉండేందుకు పాటలు పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాడంట. ఆ కుర్రాడి తండ్రి ఇంటికి వచ్చి చూసే సరికి ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయింది. బయటకు వెళ్లి చూడగా.. మృతదేహాలు బయట బావిలో పడేసి ఉన్నాయి.
పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం ఆ కుర్రాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను టీవీకి బానిసయ్యాడని.. క్రైమ్ ఇన్ వెస్టిగేషన్ స్టోరీలను ఎక్కువగా చూసేవాడని చెబుతున్నారు. అంతేకాకుండా సొంత ఇంట్లోని దొంగతనానికి కూడా పాల్పడ్డాడని తెలిపారు. క్రైమ్ స్టోరీలు ఎక్కువగా చూడటం వల్లే అతనిలో దొంగతనాలు, హత్యలు చేసేందుకు ప్రేరణ దొరికినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే హత్యలు చేసేందుకు అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అవి క్షణికావేశంతో చేసిన హత్యలా? లేక ప్రీ ప్లాన్డ్ గా చేశాడా అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.