ప్రేమ.. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు. ప్రేమిస్తున్నాని చెప్పి వెంటబడటం, ప్రేమించమని ప్రాథేయపడటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. అమ్మాయి ప్రేమించడం లేదని గట్టిగా చెప్పినా, ఇంట్లో వాళ్లతో చెప్పి వార్నింగ్ ఇప్పించినా మృగాళ్లగా మారిపోతున్నారు. ప్రేమించలేదని అమ్మాయిలపై దాడులు చేయడం ప్యాషన్ గా మారిపోయింది. మరో ప్రేమోన్మాది బుసలు కొట్టాడు. ఎంత చెప్పినా ప్రేమించలేదని అమ్మాయిపై కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి ఇంటికెళ్లి ఆమె గొంతు కోశాడు.
ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండప్రోలులో వెలుగు చూసింది. అక్కడ ఉండే రాజులపాటి కల్యాణ్ అనే కుర్రాడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆమె అతడి ప్రేమను తిరస్కరించింది. రెండు నెలలు ఆమె వెంటపడ్డాడు. అయినా ఆమె అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఆ యువతి గొంతు కోశాడు. అడ్డొచ్చిన ఆ యువతి తల్లి, చెల్లిపై కూడా దాడి చేశాడు.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. గతంలో పలుమార్లు రాజులపాటి కల్యాణ్ ని యువతి తండ్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. అది మనసులో పెట్టుకునే ఈ దాడికి పాల్పడి ఉంటాడని స్థానికులు అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజులపాటి కల్యాణ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్యాణ్ కోసం గాలిస్తున్నారు.